టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తారని గత ఏడాదిగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం అతనిని తప్పించబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఉత్త‌మ్ అనూహ్యంగా న‌ల్ల‌గొండ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. దీంతో పాటు ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తెలంగాణ‌లో మూడు ఎంపీ సీట్ల‌లో విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్లీ కాంగ్రెస్ అధిష్టానం కాస్త పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్ల‌య్యింది.


ఇక ఉత్త‌మ్ ఇప్పుడు నల్గొండ ఎంపీ సీటు నుంచి గెలవడమే కాకుండా.. తన భార్యకు హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కు భార్య ప‌ద్మావ‌తి విజ‌యం చావోరేవో అన్న‌ట్టుగా మారింది. అటు కేసీఆర్ సైతం ఉత్త‌మ్ భార్య‌ను ఓడించి రివేంజ్ తీర్చుకునేందుకు కాచుకూని కూర్చొని ఉన్నారు. ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ భార్య ఓడిపోతే ఖ‌చ్చితంగా ఆయ‌న్ను పీసీసీ ప‌ద‌వి నుంచి త‌ప్పించేస్తార‌ని అంటున్నారు.


ఈ నెల 21న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నెల 19 వ‌ర‌కు ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎప్పుడు విడిపోయి ఉండే కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్లో క‌లిసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సైతం త‌న ప‌ద‌విపై స్పందిస్తున్నారు. తన పదవీ కాలం పూర్తికావచ్చిందని.. దీంతో కొత్త అధ్యక్షుడిని అధిష్టానం నియమిస్తుందని ఆయన అంటున్నారు. తన పదవికి, హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక్కడి ఎన్నికలో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఏదేమైనా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే హుజూర్ న‌గ‌ర్ ఫ‌లితం ఆయ‌న పీసీసీ ప‌ద‌వికి అగ్నిప‌రీక్ష‌గా మారింద‌న్న‌ది మాత్రం అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఉత్త‌మ్ జాత‌కం ఎలా ?  ఉంటుందో ? ఈ నెల 24న తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: