మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయ్ పూలే, వీర్ సవార్కర్‌లకు భారతరత్న పురస్కారాలు సాధించడమే ధ్యేయమని రాష్ట్ర పార్టీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పీఎంసీ బ్యాంక్ విషయాన్ని ఎన్నికల అనంతరం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, తాను వ్యక్తిగతంగా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెడతానని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.


అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న శివసేన.. ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రాధాన్యం ఇవ్వకుండా స్వతంత్రంగా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అదీగాక ఒకవైవు ఉద్ధవ్‌ థాకరే పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వెళ్లిపోవాలనుకుంటున్న 26 మంది కార్పొరేటర్లు, 300 మంది సేన కార్యకర్తలతో తలపడటంలో నిత్యం తలమునకలవుతూ ఉండగా మరోవైపున దేవేంద్ర ఫడ్నవిస్‌ మాత్రం బీజేపీలోని తన ప్రత్యర్థి, విద్యా మంత్రి వినోద్‌ త్వాడేకి ఈ అసెంబ్లీ ఎన్నికలకు గాను సీటు దక్కకుండా చేయడంలో బ్రహ్మాండంగా విజయం సాధించారు.


బీజేపీకి అత్యంత సురక్షితమైనదిగా భావించే బోరివిల్లి శాసనసభ స్థానం వినోద్‌ త్వాడేకి ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది. అలాగే మహారాష్ట్ర పార్టీ విభాగంపై తన పట్టును మరింత బలపర్చుకున్న ఫడ్నవిస్‌ తన చిరకాల ప్రత్యర్థి, బలమైన నేత అయిన ఏక్‌నాథ్‌ ఖడ్సేకి జల్‌గావ్‌ నుంచి టికెట్టు దక్కకుండా చేయడంలో కూడా విజయవంతమయ్యారు. ఖడ్సేని తనవద్దకు పిలిపించుకున్న అమిత్‌ షా ఆయనకు సీటు ఇవ్వడానికి నిరాకరించి ఆయన కుమార్తె రోహిణ్‌ ఖడ్సే కేవాల్కర్‌కి సీటు ప్రసాదించారు.


నాగ్‌పూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన దేవేంద్ర పడ్నవిస్‌ ప్రాభవం అచిరకాలం లోనే మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 49 ఏళ్ల ఫడ్నవిస్‌ త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై ప్రభావం చూపుతున్నారు. ఇకపోతే అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, అక్టోబర్ 24న కౌంటింగ్ జరపి ఫలితాలను వెల్లడించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: