పుట్టిన నాటి నుంచే ఆసుపత్రే వాళ్ల ఇల్లు.. నర్సులు, ఆయాలే వారి చుట్టాలు.. 14 ఏళ్లపాటు నిలోఫర్‌లోనే ఉన్న అవిభక్త కవలలను ఆ తర్వాత స్టేట్ హోంకు తరలించింది ప్రభుత్వం. ఏనాడు అమ్మ అనురాగం ఎరుగరు.. నాన్న ప్రేమ చూడని ఆ చిట్టితల్లులు 17 ఏటా అడుగు పెట్టారు.


తలలు అతుక్కొని పుట్టడంతో చిన్నప్పటి నుంచి ఆసుపత్రికే పరిమితమయ్యారు అవిభక్త కవలలు వీణావాణీలు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర ఉండలేని పరిస్థితితో.. అమ్మలా వారిని అక్కున చేర్చుకుంది నిలోఫర్ ఆస్పత్రి. వారికి ఊహ తెలిసిన నాటినుంచి ఆలనాపాలనా చూసుకుంటూ.. వయసు పెరగడంతో అక్కడి నుంచి స్టేట్ హోంకు తరలించారు. అక్కడ ప్రత్యేక గదితో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చదువు నేర్పడానికి ఓ టీచర్‌ను కూడా ఏర్పాటు చేశారు.


తల్లిదండ్రులు ఉన్నా వారి ఆలనాపాలనకు ఏనాడు నోచుకోలేకపోయారు వీణావాణీలు. అమ్మ అనురాగం, నాన్న మమకారం ఎప్పుడూ రుచి చూడలేదు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి చూడడమే తప్ప నాలుగురోజులు కలిసి ఉండలేని పరిస్థితి. దీంతో వారి తల్లిదండ్రులకు పేగుబంధం మాత్రమే మిగిలింది. కనకపోయినా తల్లిదండ్రుల్లా ఆలనాపాలనా అన్ని ఆసుపత్రే చూసుకుంది.


సరిగ్గా 17ఏళ్ళ క్రితం వరంగల్ జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబంలో జన్మించారు వీణావాణీ. కవలలు పుట్టారన్న సంతోషం క్షణాల్లో ఆవిరైందా తల్లిదండ్రులకు. తలలు అతుక్కొని పుట్టిన బిడ్డలను చూసిన వారి గుండెలు విలవిల్లాడాయి. ఆధునిక వైద్యప్రపంచానికి వీణావాణీలు సవాలుగా మారారు. తెలుగు రాష్ట్రాల వైద్యులతో పాటు ముంబై, లండన్ డాక్టర్లు వారిని విడదీయడానికి ప్రయత్నించి.. ప్రాణాపాయం ఉంటుందనే భయంతో చేతులెత్తేశారు. దాంతో పుట్టినప్పటి నుంచి నరకం అనుభవిస్తూనే ఉన్నారు ఆ పసిపిల్లలు.


ఇలా 16 ఏళ్ల నుంచి నానా ఇబ్బందులు పడుతున్న వీణావాణీలు.. ఇప్పుడు 17వ ఏట అడుగుపెట్టారు. నీలోఫర్ నుంచి స్టేట్‌ హోంకు తరలించిన తర్వాత వారి ఆపరేషన్‌కు కూడా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. పాపం అనడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: