ఓ ముఖ్యమంత్రి సెక్యూరిటీని పక్కనపెట్టి బైక్‌పై రయ్యిమంటూ దుసుకుపోతుంటాడు.. అదేదో మహేష్ బాబు సినిమా అనుకుంటున్నారా..? కానే కాదు.. రియల్ గా సీఎం ఈ స్టంట్ చేశాడు.. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి...? 


అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు వినూత్న ప్రయోగం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ. స్వయంగా ఆయనే బైక్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. 


బైక్‌రైడింగ్‌, సాహస క్రీడలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ ప్రాంతం. అటువంటి ప్రాంతానికి పర్యాటకుల్ని ఆకర్షించి ప్రోత్సహించేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650 బైక్‌పై పర్యటనకు బయలుదేరారు అరుణాచల్ ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ. ఒకటీ, రెండు కాదు ఏకంగా 122 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించారు.  


పర్యాటకంగా అత్యంత ఆకర్షణీయ ప్రాంతమైన యుంగ్‌కియాంగ్‌ నుంచి పాసిఘాట్‌ వరకు బైక్‌పై ప్రయాణించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. బైక్‌ రైడింగ్‌, సాహస క్రీడలకు ఇది మంచి ప్రదేశమంటూ ట్వట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. కాగా పెమాఖండూ ప్రయాణాన్ని అక్టోబర్ 13న ఉదయం 8గంటలకు యుంగ్‌కియాంగ్‌ నుంచి ప్రారంభించగా, పాసిఘాట్‌ విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నారు. 


పెమాఖండూ ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ పలుసార్లు బైక్‌ రైడ్‌ చేస్తూ అలరించారు. గతేడాది బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు సైకిల్‌ తొక్కి సంచలనం రేకెత్తించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు అరుణాచల్ ప్రదేశ్ సీఎం.


పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సాధారణంగా పదవుల్లో ఉండే నేతలు ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. కానీ ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన బలగాల్ని పక్కన పెట్టి ఒంటరిగా బైక్ రైడ్ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. టూరిజాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఇంతలా కృషి చేస్తున్న పెమా ఖండూకు ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే..!


మరింత సమాచారం తెలుసుకోండి: