ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల కొరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతసేపటి క్రితం కేబినేట్ సమావేశం ముగిసింది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో 13 జిల్లాలలోని ప్రతి చేనేత కార్మికుడికి, ఏ కుటుంబం మగ్గంపై జీవనం సాగిస్తుందో ఆ చేనేత కుటుంబానికి ఒకే విడతలో 24 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
ఈ ఆర్థిక సాయం ద్వారా చేనేత కార్మికులు మగ్గాల ఆధునీకరణ చేసుకోవచ్చని తెలిపారు. వైయస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం ఉన్న కుటుంబానికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. మగ్గంపై ఆధారపడి జీవించే వారి గురించి సర్వే జరుగుతోందని ఈ నెల చివరకు గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతామని డిసెంబర్ 21వ తేదీన ఈ పథకం సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని తెలిపారు. 
 
ప్రాణాన్ని పణంగా పెట్టి సముద్రంలో వేట ద్వారా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని పేర్ని నాని అన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17 నుండి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్యకారులకు వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తుందని వేట నిషేధ కాలంలో 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోట్లు, తెప్పలపై వేట చేసే వారిని కూడా ఈ పథకంలో చేర్చబోతున్నారని తెలుస్తుంది. 
 
నవంబర్ 21వ తేదీన అంతర్జాతీయ మత్స్య దినోత్సవం రోజున ఈ పథకం అమలు చేయటానికి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులు బోట్లకు వాడే లీటర్ డీజిల్ పై 9 రూపాయల సబ్సిడీ ఇస్తామని గతంలో సబ్సీడీ కంటే సబ్సిడీ మొత్తాన్ని 50 శాతం పెంచామని అన్నారు. నిర్దేశిత డీజిల్ బంకుల ద్వారా డీజిల్ కొనుగోలు చేసే సమయంలోనే సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: