తెలుగుదేశంపార్టీ నేతలు  జేసి బ్రదర్స్ కు ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. అనుమతులు లేకుండా తిరుగుతున్న జేసి ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ సీజ్ చేసింది. అనంతపురం జిల్లాలోని అనంతపురం, హిందుపురం ప్రాంతాల్లో తిరగటానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా జేసి ట్రావెల్స్ కు చెందిన 8 బస్సులు యధేచ్చగా తిరుగుతున్నట్లు రవాణా శాఖ గుర్తించింది.

 

దాంతో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున కాపు కాసి మరీ బస్సులను పట్టుకున్నారు. బస్సులను ఆపి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు అవసరమైన పర్మిట్లు చూపించమని అడిగినపుడు వాళ్ళు చేతులెత్తేశారు. దాంతో వెంటనే సిబ్బందిని అదుపులోకి తీసుకుని బస్సులను సీజ్ చేశారు.

 

పర్మిట్లు లేకుండానే తిరిగే  విషయంలో జేసి ట్రావెల్స్ విషయంలో చాలా కాలంగా  ఆరోపణలున్నాయి. అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తరువాత టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వాళ్ళ అధికారానికి ఎదురులేకుండా ఉండేది. కానీ అధికారం మారగానే జగన్మోహన్ రెడ్డి వ్యవస్ధలన్నింటినీ దేని పని దానిని చేసుకునేట్లు పూర్తి స్వేచ్చనిచ్చారు.

 

ఎప్పుడైతే వ్యవస్ధలకు పూర్తి స్వేచ్చ వచ్చిందో వెంటనే ఉన్నతాధికారులు కూడా కొరడాను ఝుళిపించటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై యధేచ్చగా దాడులు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నది. ఇందులో భాగంగానే జేసి ట్రావెల్స్ పైన కూడా దాడులు జరిగాయి.

 

నిజానికి ఉండటానికి చాలానే ప్రైవేటు ట్రావెల్స్ ఉన్న దేనిపైనా లేని ఆరోపణలు జేసి ట్రావెల్స్ పైనే ఎందుకు ఉంటున్నాయి ?  ఎందుకున్నాయంటే జేసి బ్రదర్స్ గా పాపులరైన  మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా కూడా బలవంతులు కావటమే.

 

ఇటు ట్రావెల్స్ యాజమానులు కాకుండా అటు ప్రజాప్రతినిధులు కూడా కావటంతో వారి అధికారానికి ఎదురు లేకుండా పోయింది. అందుకనే ప్రభుత్వంలో ఎవరున్నా వారి జోలికి పట్టించుకునే వారు కాదు. కానీ మొదటిసారి జేసి బ్రదర్స్ ఒకేసారి అధికారానికి దూరమయ్యారు. దాంతో వాళ్ళ అధికారానికి కోతలు పడింది. దాంతో వారికి షాకులు తగులుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: