రాజ్‌ ఠాక్రే...మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్‌. శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడైన బాల్‌ ఠాక్రే సోదరుడి కుమారుడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ తరువాత మనసు మార్చుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ-శివసేన, అటు ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తుండగా.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన. అక్టోబర్ 21న జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రాజ్ థాక్రే తెలిపారు. అయితే, దీనికి కొన‌సాగింపుగా మ‌రోమారు ఆయ‌న స్థానిక విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌యత్నం చేశారు. 


సుదీర్ఘ‌కాలంగా మౌనంగా ఉన్న మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే థాణె జిల్లాలోని దోంబివిలి ప్రాంతంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బయటి వ్యక్తులు భారీ సంఖ్యలో మహారాష్ట్రకు వచ్చి స్థిరపడటంతో స్థానికులకు అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలకు వీళ్లు బరువుగా మారారని మండిప‌డ్డారు. ``అసలు సమస్య ఎక్కడుందంటే.. బయటి వ్యక్తులు వచ్చి రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఈ సమస్య థాణెలో తీవ్రంగా ఉన్నది. దీంతో స్థానికులకు అవకాశాలు దొరకడం లేదు’ అని పేర్కొన్నారు. సీఎం ఫడ్నవీస్‌ తన ప్రసంగాల్లో అన్ని అబద్ధాలే చెబుతారని విమర్శించారు.ఆరెస్సెస్‌ సానుభూతిపరులు దోంబివలి పట్టణంలో నివసిస్తున్నారు. ఆరెస్సెస్‌ మాట వినే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. కానీ దోంబివిలి పట్టణం పేదరికంతో మగ్గిపోతున్నది.`` అని దుయ్య‌బ‌ట్టారు. ఇలా రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాల‌తో ఠాక్రే ఈ ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకునే ప్ర‌య‌త్నం  చేస్తున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. 


కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేస్తున్న ఆదిత్య ఠాక్రేపై అభ్యర్థిని నిలబెట్టకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నిర్ణ‌యం తీసుకుంది. వర్లి నియోజకవర్గంలో ఎమ్మెన్నెస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 32 వేల ఓట్లు సాధించింది. 2014 నాటికి ఈ సంఖ్య 8 వేలకు పడిపోయింది. వర్లి స్థానాన్ని ఈసారి తమ మిత్రపక్షం పీపుల్స్‌ రిపబ్లికన్‌ అండ్‌ సోషలిస్ట్‌ పార్టీ (పీఆర్‌ఎస్‌పీ)కి ఎన్సీపీ కేటాయించింది. 2009లో ఇక్కడి నుంచి ఎన్సీపీ అభ్యర్థి  సచిన్‌ అహిర్‌ గెలుపొందారు. 2014లో శివసేన అభ్యర్థి సుశీల్‌ షిండే గెలిచారు. సచిన్‌ అహిర్‌ ఇటీవల శివసేన పార్టీలో చేరారు. ప్ర‌స్తుతం ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి ఆదిత్య ఠాక్రే దిగిన సంగ‌తి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: