సాధారణంగా ప్లేటు బిర్యానీ ధర 100 రూపాయల నుండి 400 రూపాయల వరకు హోటల్, రెస్టారెంట్ స్థాయిని బట్టి ఉంటుంది. కానీ తమిళనాడులోని ఆర్కే నగర్ లో మాత్రం కేవలం ఐదు పైసలకు ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించారు. ఐదు పైసలకు ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ అందించటం ఏమిటి..? ఐదు పైసలకు చికెన్ బిర్యానీ విక్రయిస్తే అమ్మిన వారికి భారీగా నష్టాలు వస్తాయి కదా..? అనే అనుమానాలు సాధారణంగా వస్తాయి. 
 
కానీ ఐదు పైసలకు బిర్యానీ అమ్మటం వెనుక ముఖ్యమైన కారణమే ఉంది. కొన్ని రోజుల క్రితం నుండి తమిళనాడులోని సోషల్ మీడియాలో ఐదు పైసలకే ప్లేటున్నర చికెన్ బిర్యానీ అనే ప్రకటన బాగా వైరల్ అయింది. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలోని ముజిఫ్ బిర్యానీ దుకాణంలో ఐదు పైసల నాణేలు తీసుకొచ్చిన మొదటి 100 మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని ముజిఫ్ బిర్యానీ దుకాణం యజమానులు ప్రకటించారు. 
 
ఈ ప్రకటనతో నిన్న ఉదయం ఐదు పైసల నాణేలతో బిర్యానీ దుకాణం దగ్గరికి చాలా మంది వచ్చారు. ముజిఫ్ బిర్యానీ దుకాణాదారులు 5 పైసల నాణేలు తీసుకొనివచ్చిన వారి పేర్లు మరియు సెల్ ఫోన్ నంబర్లు తీసుకొని వారికి చికెన్ బిర్యానీ అందించారు. మొదట వచ్చిన 100 మందికి ఐదు పైసలకు  ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ అందించటంతో అక్కడకు వచ్చినవారు ఆనందం వ్యక్తం చేశారు. 
 
ముజిఫ్ బిర్యానీ దుకాణం యజమాని ముజిఫ్ రహ్మాన్ తమిళనాడులోని కీళడి ప్రాంతంలో 2,300 సంవత్సరాలకు పూర్వం ప్రజలు వాడిన నాణేలు, వస్తువులు దొరికాయని భవిష్యత్తు తరానికి మనం ఉపయోగించే వస్తువులు మరియు నాణేల గురించి అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఐదు పైసల నాణేనికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ విక్రయించినట్లు తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: