తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఇప్పటికే నరకయాతన అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రజల కొరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. బస్సులు తగినంతగా లేకపోవటంతో హైదరాబాద్ నగరంలోని ప్రజలు ఎక్కువగా క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ క్యాబ్ డ్రైవర్లు కూడా వివిధ డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తోంది. 
 
క్యాబ్ డ్రైవర్ల సమ్మె కారణంగా 40,000 కు పైగా క్యాబ్ లు నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ నగర ప్రజల కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఊబర్, ఓలా కంపెనీలకు మరియు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కు తెలంగాణ స్టేట్ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ గతంలోనే డిమాండ్ల లిస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీ నుండి క్యాబ్ డ్రైవర్లు నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. 
 
ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెతో క్యాబ్ లకు హైదరాబాద్ నగరంలో డిమాండ్ బాగా పెరిగింది. కంపెనీలు కూడా గతంతో పోలిస్తే ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో క్యాబ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న క్యాబ్ లు ఓలా, ఉబర్ అనే చెప్పాలి. క్యాబ్ కంపెనీలు పెట్టిన నియమ నిబంధనలు కఠినంగా ఉండటం వలన డ్రైవర్లు భారీగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. 
 
క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగితే హైదరాబాద్ నగర ప్రజలు మరిన్ని కష్టాలు పడే అవకాశం ఐతే ఉంది. ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగితే హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి క్యాబ్ కంపెనీలు సమ్మెను విరమింపజేయటానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తాయేమో చూడాలి. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: