టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆర్టీసీ కార్మికులు సమ్మెను వీడాలని ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఇటీవల చేసిన సూచనలతో.. ప్రభుత్వం ఓ మెట్టు దిగిందని భావించారంతా. చర్చలు జరిగే అవకాశం ఉందని ఆశించారు. కానీ బుధవారం రాత్రి ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రితో కేసీఆర్ చర్చలు జరిగిన తర్వాత.. చర్చలకు ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.


ఇకపోతే  సమ్మె కారణంగా ఆర్టీసీ దాదాపు రూ. 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని.. పండుగ సీజన్లో కార్మికులు సమ్మెకు వెళ్లడం ఏంటని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆరా తీశారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రితో చర్చించారు.  కార్మికుల డిమాండ్లను వివరించడానికి గవర్నర్‌ వద్దకు రవాణాశాఖ కార్యదర్శిని మంత్రి పంపించారు. త్వరలోనే మంత్రి అజయ్‌ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కాగా, సమ్మె ప్రభావం, విద్యాసంస్థలకు దసరా సెలవుల పొడగింపు తదితర అంశాలపై గవర్నర్‌ ఆరా తీసినట్లు సమాచారం. ఇక తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కూడా కొనసాగుతోంది. ఇకపోతే రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, 16 శాతం ఐఆర్ ఇచ్చామని.. సంస్థ కోసం 3300 కోట్లు సాయం చేశామని.. కానీ ఆర్టీసీ లాభాల బాట పట్టలేదని కేసీఆర్ చెప్పారట. అంతే కాకుండా  ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారని సమాచారం...ఇక గవర్నర్‌ వద్దకు వెళ్లిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ ముగిసింది. చర్చకు ఏ అంశాలు వచ్చాయనేది తెలియవలసింది వుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: