వాళ్లంతా విదేశీ యువకులు. చదువుల పేరుతో వీసాలు పొందారు. తీరా ఇక్కడికి వచ్చాక.. అసలు దందా మొదలు పెట్టారు. కాస్ట్‌లీ బైకుల మీద రావడం...డ్రగ్స్‌ అమ్మడం... ఇదే వారి డ్యూటీ. బెజవాడ డ్రగ్స్‌ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


ఇప్పటి వరకు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్ కల్చర్.. ఇప్పుడు ఏపీ రాజధానికి పాకింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దందా నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండేళ్ళుగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కేవలం సంపన్న వర్గం విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్టు తేలింది. ఒక్కో గ్రాము 5 వేల వరకు విక్రయించినట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్, బెంగుళూరు నుంచి కొరియర్ ద్వారా సరఫరా చేయించుకుని ఇక్కడ వారికి విక్రయిస్తున్నట్టు ప్రాధమిక విచారణలో తెలిసింది.


విదేశీ విద్యార్థులే డ్రగ్స్‌ దందాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సూడాన్, నైజీరియా, టాంజానియా, ఇధియోపియా విద్యార్థులు మాఫియాగా ఏర్పడినట్లు తేల్చారు. వీరంతా కృష్ణా, గుంటూరు జిల్లాలో మకాం వేసి, కొన్నాళ్ళపాటు కాలేజీల్లో డబ్బున్న విద్యార్థులతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తారు. ఆ తర్వాత సరదా పార్టీల పేరుతో మెల్లగా విద్యార్థులకు డ్రగ్స్‌ను అలవాటు చేస్తారు. తీరా ట్రాప్‌లో పడ్డాక.. డబ్బులకు విక్రయిస్తారు. 


కాలేజీల్లో డ్రగ్స్ వాడే వర్గం, వాటిని దూరం పెట్టే వర్గాలుగా విడిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. కొకైన్, ఎండీఎచ్ వంటి పలు రకాల డ్రగ్స్‌ను ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ముఠా అమ్ముతోంది. ఈ డ్రగ్స్ గొడవలు కొన్ని యాజమాన్యాల దృష్టికి వచ్చినా వారు మాత్రం పోలీసుల వరకు వ్యవహారాన్ని రానీయలేదు. దీంతో ప్రస్తుతం యాజమాన్యాలను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.


ఐతే.. డ్రగ్స్‌ వాడుతూ పట్టుబడ్డ విద్యార్థులను విచారించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులు ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలపైనా ఫోకస్‌ పెట్టారు. బ్యాంకు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. లావాదేవీలతో డ్రగ్స్‌ ముఠాల పనిపట్టాలని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: