కేంద్రంలో రెండో సారి బంపర్ మెజారిటీ అధికారంలోకి వచ్చిన బీజేపీ....దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఒకశాతం ఓట్లు కూడా దక్కించుకొని ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఇతర పార్టీ నేతలని చేర్చుకుని ముందుకెళుతుంది. ముఖ్యంగా మొదట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులని చేర్చుకున్న బీజేపీ....ఆ తర్వాత కూడా మరికొందరు నేతలకు కాషాయ కండువా కప్పారు. అలాగే కొందరు జనసేన నేతలని కూడా చేర్చుకున్నారు.


ఈ క్రమంలోనే నవంబర్ నెలలో బీజేపీలోకి ఊహించని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. నవంబర్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు ఏపీ పర్యటనకు రాబోతున్నారని చెబుతున్నారు. ఈ పర్యటనలో ఊహించని నేతలు పార్టీలో చేరతారని చెబుతున్నారు. ఇలా బీజేపీ నేతలు చెప్పే విషయం జరుగుతుందా అంటే కష్టమనే చెప్పాలి.


ఏపీలో బీజేపీ బలపడితే ఆ ప్రభావం టీడీపీ మీద ఎక్కువ పడుతుంది. అలా అని వైసీపీ మీద పడకుండా ఉండదని చెప్పలేం. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ మీద కొంత ప్రభావం చూపే అవకాశముంది. అందుకనే జగన్ ఈ మధ్య వలసలని గట్టిగా ప్రోత్సహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో కొంచెం పాలనలో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. ఆ సమయంలో బీజేపీలో వలసల జోరు సాగింది. కానీ జగన్ పరిస్థితిని అర్ధం చేసుకుని ఒక నెల నుంచి టీడీపీ, జనసేన పార్టీల నుంచి నేతలని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.


టీడీపీకి చెందిన తోట త్రిమూర్తులు, ఆడారి ఆనంద్, వరుపుల రాజా, జూపూడి ప్రభాకర్...జనేన నుంచి ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, అల్లూరి కృష్ణంరాజు ఇలా నేతలని వరుసగా చేర్చుకుంటున్నారు. ఇంకా ఈ వలసలు కొనసాగించాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థ, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి.


ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటే బలమైన నేతలని చేర్చుకోవాల్సిందే. కాబట్టి బీజేపీలోకి ఏ చిన్న చితకా నేతలు వెళతారు తప్ప బడా నేతలు వెళ్ళే అవకాశం లేదు. అయితే ఇంకా టీడీపీ, జనసేనకి చెందిన నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వారి చేరికలు ఉంటాయి. ఏదేమైనా జగన్ బీజేపీకి అంత సీన్ ఇవ్వరనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: