అశ్వత్థామ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో మారు మోగుతున్న పేరు.. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకుడు. ఆర్టీసీ సమ్మెతో ఈ అశ్వత్థామ రెడ్డి పేరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. సమ్మెను కేసీఆర్ పట్టించుకోకపోవడం.. హైకోర్టు చెప్పినా చర్చలకు పిలవని నేపథ్యంలో అశ్వత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని ఆశ్వత్థామరెడ్డి అన్నారు. తన టెలిఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం అవుతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ సమయంలో ఆయన సమ్మెకు కార్మికుల మద్దతు లేదని బీటీ బ్యాచ్ నేతలు ప్రచారం చేస్తున్నారని.. యూటీ బ్యాచ్ మంత్రులు మీడియా ముందు విమర్శించినా ఇంటికి వెళ్లి బాధపడుతున్నారని అన్నారు. ఇంతకీ ఈ బీటీ బ్యాచ్ ఏంటి.. యూటీ బ్యాచ్ ఏంటి.. ఈ పదాల వెనుక చాలా కథ ఉంది. ఉద్యమ నేప‌థ్యంలో ఏర్పడ్డ తెలంగాణ‌లో ఉద్యమ సమ‌యంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించి రాష్ట్ర సాధ‌న‌కు అన్నీ త్యాగం చేసిన వారిలో కొందరికే ఆ తర్వాత కాలంలో పదవులు దక్కాయి. ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన చాలా మందిని కేసీఆర్ తర్వాత కాలంలో పక్కకు పెట్టారు.


ఉద్యమంలో పాల్గొనకుండా.. ఆ తర్వాత కాలంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన కొందరు నేతలకు కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారు. తెలుగు దేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన చాలా మందికి పదవులు దక్కాయి. పార్టీలోకి వచ్చిన మొదట్లో వీరంతా బంగారు తెలంగాణ కోసం వచ్చామని చెప్పేవారు. అందుకే మొదటి నుంచి ఉద్యమంలో లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో చేరి లాభం పొందిన నేతలను బంగారు తెలంగాణ బ్యాచ్ అని అనడం మొదలుపెట్టారు. అంటే వీరు బీటీ బ్యాచ్ అన్నమాట.


ఇక ఉద్యమలో మొదటి నుంచి ఉన్నవారు.. ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అన్నమాట.. అంటే యూటీ బ్యాచ్ అన్నమాట. ఈ విషయాన్నే అశ్వత్థామ రెడ్డి తన విమర్శల్లో పేర్కొన్నారు. తెలంగాణ కోసం మొదటి నుంచి కొట్లాడిన హరీశ్ రావు, ఈటల రాజేందర్ వంటి యూటీ బ్యాచ్ నేతలు గళం విప్పాలంటున్నారు. ఇదీ సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: