ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీ సీఎం జగన్ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. లక్షల కొద్దీ గ్రామ వాలంటీర్ల పోస్టులు ఇప్పటికే భర్తీ చేశారు. లక్షన్నరకుపైగా గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. అంతే కాకుండా.. ఇకపై ప్రతి జనవరిలోనూ ఉద్యోగాల కేలండర్ ఇస్తామని జగన్ ఘంటాపథంగా చెబుతున్నారు.


వీలైనంత త్వరగా ఖాళీ పోస్టుల ను గుర్తించి నోటిఫికేషన్లు సిద్దం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి జనవరిలో కూడా ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ విడుదల చేయాలని నిర్దేశించారు. అత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.అంతే కాదు.. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.


ఇకపై ఎలాంటి తప్పులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.అదే సమయంలో తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక పోస్టుల ప్రకియ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. కోర్టుల్లో కేసులు దీన్ని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పరీక్షల ఊసే తెలంగాణలో ఎత్తడం లేదు.


అసెంబ్లీ ఎన్నికల ముందే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నించినా ఇంకా సాధ్యం కాలేదు. గ్రూప్ 1 ఉద్యోగాలను జిల్లా కేడర్ గా మార్చడం వల్ల సాంకేతిక సమస్యలతో ఇప్పటి వరకూ నోటిఫికేషనే ఇవ్వలేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణలో నియామకాల విషయంలో మాత్రం నిరుద్యోగులు అంత సంతోషంగా లేరు. దీనికి తోడు ఉద్యోగాల ప్రక్రియలో పారదర్శకత కొరవడి అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: