అంధ్ర ప్రదేశ్ కి మళ్ళీ ఒక పుట్టిన రోజు దొరికింది. గత కొన్నేళ్ళుగా ఏపీ ఫార్మేషన్ డే అన్నది లేకుండా పోయింది. దాంతో ఆంధ్రులు ఓ విధంగా అవమానపడ్డారు, ఆత్మన్యూనతాభావానికి గురి అయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణా దర్జాగా జూన్ 2న  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూంటే ఏపీ మాత్రం ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి. పొట్టి శ్రీరాములు పొరాడి సాధించిన ఆంధ్రరాష్ట్రానికి ఒక పుట్టిన రోజు అంటూ ఉందని ఇపుడు జగన్ సర్కార్ చాటి చెప్పనుంది.


ఈసారి నవంబర్ 1 మాములుగా గడచిపోదు. మళ్ళీ పూర్వం మాదిరిగా కళకళ్లాడుతుంది. ఆంధ్రుల ప్రత్యేకతను వివరించే రోజుగా మళ్ళీ చరిత్రలోకి ఎక్కనుంది. తెలంగాణా ఉద్యమం పీక్ స్టేజ్ కి వచ్చిన తరువాత ఉమ్మడి ఏపీలో కూడా నవంబర్ 1 ని జరపనివ్వలేదు. సవ్యంగా చేయనివ్వలేదు. ఆ రోజుని బ్లాక్ డేగా నిర్ణయించేశారు ప్రత్యేక రాష్ట్రవాదులు.  దాంతో కొన్నేళ్ళుగా నవంబర్ 1 అంటే నిరాశా నిస్సత్తువతో పాటు,  గత వైభవ గురుతుగా మిగిలిపోయింది. దాంతో ఇపుడు జగన్ సర్కార్ మళ్ళీ నాటి వైభవాన్ని, గౌరవాన్ని ఆంధ్రులకు దక్కించేందుకు నవంబర్ 1 ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా నిర్వహించనుంది. దాంతో ఈసారి నవంబర్ 1 అదిరిపోనుంది. 


ఇప్పటివరకూ అందుతున్న సమాచారం బట్టి చూస్తే నవబర్ 1వ తేదీని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా చేయాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా ఉంది. దాని మీద ఒకటి రెండు రోజుల్లో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారు. అపుడు అధికారికంగా ప్రకటన వస్తుందని అంటున్నారు. మొత్తానికి నవంబర్ 1 మాత్రం ఈసారి రాష్ట్ర పండుగ రోజు కావడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి తెలుగుతల్లి వైభవం. నాటి ప్రాభవం.




మరింత సమాచారం తెలుసుకోండి: