వెంకన్నను దర్శించుకునేందుకు ప్రపంచంలోని హిందువులు నలుమూలల నుండి తిరుమలకు వస్తారు. తమ మొక్కుల ప్రకారం నిలువు దోపిడి ఇచ్చుకునే వారు, హుండీలో ముడుపులు చెల్లించుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబునాయుడు మాత్రం వెంకన్న ఆదాయాన్నే దోచేసుకున్నారు.  ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) విజిలెన్స్ విభాగం తన దర్యాప్తులో సాక్ష్యాధారాలతో సహా నిరూపించింది.

 

 ఇంతకీ విషయం ఏమిటంటే ఆమధ్య కేంద్రప్రభుత్వంపై పోరాటం పేరుతో చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేసిన విషయం గుర్తుంది కదా ? వాస్తవానికి అదో దండగమారి పోరాటాలనే చెప్పాలి. నరేంద్రమోడిపై పోరాటం పేరుతో ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా  ధర్మపోరాటాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు.

 

ఐదేళ్ళ పదవీ కాలంలో చంద్రబాబు చేసిన వందల కోట్ల రూపాయ వృధాలో ఇదో ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలోని సుమారు 11 చోట్ల ధర్మపోరాట దీక్షలు చేసినట్లే ఢిల్లీలో కూడా చేశారు. ఏపి భవన్లో చేసిన ఈ దీక్షలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేశారు. దీక్షలో ఖర్చు పెట్టటానికి బహుశా ప్రభుత్వ ఖజనాలో చిల్లిగవ్వ కూడా లేనట్లుంది. అందుకనే వెంటనే చంద్రబాబు కన్ను టిటిడిపై పడింది.

 

ఇంకేముంది టిటిడి బంగారు బాతులాగ చంద్రబాబుకు కనబడింది. వెంటనే ఆదేశాలివ్వటం టిటిడి కూడా సుమారు రూ. 4 కోట్లను ధర్మపోరాట దీక్షల నిర్వహణకు విడుదల చేయటం జరిగిపోయింది. ఈ డబ్బునంతా దేనికి వాడారయ్యా అంటే రాష్ట్రం నుండి ప్రజాప్రతినిధులను ఢిల్లీకి పిలిపించటానికి, వారి బస, వసతి  సైకర్యాలు ఏర్పాటు చేయటానికి.

 

అంతేనా ఏపి భవన్లో దీక్షను పరామర్శించటానికి వచ్చిన వివిఐపిలకు స్నాక్స్ తదితరాల  సరఫరాకు కూడా ఉపయోగించారు.  ధార్మిక కార్యక్రమాలకు తప్ప ఇతరత్రా అవసరాలకు  టిటిడి నిధులను వాడటం నిషేధం.  ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు టిటిడి నిధులను ఉపయోగించుకున్నారు. టిటిడి నిధులనే తన సొంత ప్రచారానికి ఉపయోగించుకున్న చంద్రబాబు ఇక ప్రభుత్వ ఖజానాను ఏ స్ధాయిలో నాకేసారో అర్ధమైపోతోంది. ఈ విషయాలన్నీ విజిలెన్స్ విచారణలో బయటపడ్డాయి.  కాబట్టి చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: