ప్రైవేటు క్యాబ్ సేవ‌ల సంస్థ ఓలా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో ఆ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవ‌ర్లు త‌మ డిమాండ్ల సాధ‌న‌కు స‌మ్మెకు పిలుపునిచ్చిన స‌మ‌యంలోనే...ఢిల్లీ వేదిక‌గా క్యాబ్ అగ్రిగేటర్‌‌‌‌ ఓలా అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. సెల్ఫ్ డ్రైవ్ కారు రెంటల్ సర్వీస్‌‌ల్లోకి అడుగుపెట్టింది. తన ప్లాట్‌‌ఫామ్‌‌పై ‘ఓలా డ్రైవ్’ కింద ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలాఉండ‌గా... ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. ఓలా, ఉబర్, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న క్యాబ్స్ ఓనర్లు, డ్రైవర్లు సమ్మెకు దిగనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. 


తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఆగస్టు 30న తెలంగాణ రవాణాశాఖకు లేఖ అందించామని… అయితే, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తాము సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్ర‌కటించారు. 19 నుంచి సమ్మెకు వెళ్లాలా వద్దా అనే విషయంపై అసోసియేషన్‌లో ఓటింగ్ నిర్వహించగా 75% మంది సమ్మె చేయాలని నిర్ణయించారు. దీంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు  తెలిపారు. 


కాగా, ‘ఓలా డ్రైవ్’ కింద బెంగ‌ళూరులో ఈ సర్వీసులను తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌‌గా ఓలా ప్రారంభించింది. ఈ  సర్వీసులను హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో త్వరలోనే లాంచ్ చేయాలని ఓలా ప్లాన్ చేస్తోంది. ఈ స్పేస్‌‌లో ఉన్న ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే 30 శాతం తక్కువగా సెల్ఫ్ డ్రైవ్ కార్లను అందిస్తామని ఓలా చెబుతోంది. వచ్చే ఏడాది చివరి నాటికి 20 వేల వెహికిల్స్‌‌ను యాడ్ చేయాలనేదే ఓలా లక్ష్యం. రెసిడెన్షియల్, కమర్షియల్ హబ్స్‌‌లోని పలు పికప్ స్టేషన్ల ద్వారా ఓలా ఈ సర్వీసులను యూజర్లకు ప్రవేశపెట్టింది. రూ.2000 డిపాజిట్‌‌ను చెల్లించి రెండు గంటల కోసం యూజర్లు తమకు నచ్చిన కారును బుక్ చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: