తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమ్మె 14 వ రోజు చేరుకుంది..ఇకపోతే దీపావళీ పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ దశలో అటు ప్రభుత్వం గాని , ఆర్టీసీ నాయకులుగాని ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకరకంగా ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మినీ సంగ్రామమే నడుస్తుంది. ఇకపోతే విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలు ఘాటుగా సమాధానమిస్తున్నాయి..


ఇక ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారన్న విషయం తెలిసిందే.. ఇక ఆర్టీసీ సమ్మెలో కీలక పాత్ర పోషిస్తున్న  అశ్వత్థామ రెడ్డి  ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు తాము ఈ పోరాటానికి దిగుతున్నట్లు వారు తెలిపారు. ఇక తాము ఎవరి చేతుల్లో కీలుబొమ్మలం కాదని పేర్కొన్నారు. అదీగాకుండా ప్రభుత్వం నియమించిన కమిటీ తమమాటను పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.


ఆర్టీసీని కాపాడవలసిన కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో తామంతా కేసీఆర్ కు బాసటగా సకలజనుల సమ్మెలో పాల్గొన్నామని, జైలుకు కూడా వెళ్లామని గుర్తుచేశారు. తెలంగాణకు తొలిదశ మలిదశ ఉద్యమాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక ఉద్యమం అలానే చేయవలిసిన అవసరం ఏర్పడిందన్నారు.. ఇకపోతే సమ్మె రోజు రోజుకు ఉదృతం అవుతున్న సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.


సమ్మెను నిర్వీర్యం చేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అలజడి రేపింది. ఈ నెల 19వ తేదీన (శనివారం) తలపెట్టిన తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: