ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో మార్పు లేక‌పోవ‌డం...కార్మికుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం అవుతుండ‌టంతో... స‌మ్మె వాడీ వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనూహ్యంగా మద్దతు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ, గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం సచివాలయానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశమైంది. తమ అపరిష్కృత డిమాండ్లతో పాటు ప్రధానంగా ఆర్టీసీ సమ్మెతో చోటు చేసుకున్న పరిణామాలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులకు తాము కూడా మద్దతు ప్రకటించామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెను విరమింప చేయడానికి చొరవ తీసుకోవాల్సిందిగా కోరింది. లేని పక్షంలో కార్మికుల ఆందోళనలో తాము కూడా భాగస్వాములం కాకతప్పదని హెచ్చరించారు. 


ఇలా వివిధ ప‌క్షాలు త‌మ పోరాటంలో భాగ‌స్వామ్యం అవుతుండ‌గా...తాజాగా ఈ జాబితాలో జనసేన పార్టీ చేరింది. తెలంగాణ జనసేన పార్టీ ఇన్చార్జ్ శంకర్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...పొలిట్ బ్యూరో సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై త‌మ అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారని వెల్ల‌డించారు. శ‌నివారం ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బందుకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని వెల్ల‌డించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను జనసేన ఎక్కడికక్కడ ఎండగడుతుందని ప్ర‌క‌టించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాటం చేసిందని, అదే రీతిలో ఆర్టీసీ విష‌యంలోనూ వ్య‌వ‌హ‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటారని, ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదని ప్ర‌క‌టించారు. 


ఇదిలాఉండ‌గా, కార్మికుల సమ్మెపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. విచారణ అనంతరం యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని, అక్టోబర్ 28లోగా చర్చలు ముగించి స్పష్టమైన నివేదిక అందించాలని హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులుపై స్పందించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...14రోజులుగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తుందన్నారు. దేశం మొత్తం తెలంగాణ ప్రజా రవాణాను, ఆర్టీసీని బతికించేందుకు అండగా నిలబడ్డారని చెప్పారు. ఆర్టీసీ పోరాటం ప్రజా పోరాటంలా మారిందని అన్నారు. యాజమాన్యంతో 26 కార్మికుల డిమాండ్లు నెరవేర్చేలా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే యాజమాన్యం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని, చర్చలు చర్చలే..సమ్మె సమ్మేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: