సీఎం జగన్...తొలిసారి అధికారంలోకి రావడమే అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలందరికి మంచి సంక్షేమాన్ని అందిస్తూ, ఐదు నెలల్లోనే మంచి సీఎం అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఐదు నెలల కాలంలో సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింట్లో సగం విధానంతో జగన్ పాలన కొనసాగించారు. అందుకే జగన్ కు ఎక్కువ మద్ధతు మహిళామణుల నుంచే వస్తుంది. తాను పాలన మొదలుపెట్టగానే అవ్వా, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ని రూ. 2 వేల నుంచి...రూ. 2,250కి పెంచారు. అలాగే రూ.3 వేలు ఉండే ఆశా వర్కర్ల జీతాన్ని పది వేలు చేశారు.


గ్రామ వాలంటీర్లు, సచివాలయాల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పించారు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు,ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు. అటు మహిళల జీవితంలో వెలుగుని పోగొడుతున్న మద్యాన్ని దశల వారీగా నిషేధించేందుకు నడుంబిగించారు. ఇవేగాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పించాలని, ఇందులో 50 శాతం మహిళలతో భర్తీ చేయాలని ఆదేశించారు.


అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేశారు. ఇక డ్వాక్రా మహిళలకు అధికారంలోకి వచ్చేనాటి వరకు ఉన్న రుణాలకు సమానమైన సొమ్మును నాలుగు విడతల్లో అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు రానున్న రోజుల్లో పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15,000 అందించనున్నారు. ఇంటర్‌ వరకూ పథకం వర్తింపు చేసి, జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.


అదేవిధంగా 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ.75 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.  కేవలం సంక్షేమ పథకాల్లోనే గాకుండా మహిళలకు పార్టీలో కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ముగ్గురు మహిళలని మంత్రివర్గంలో తీసుకుని, అందులో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. అలాగే ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్ గా రోజాని, మహిళా కమిషన్ ఛైర్మన్ గా వాసిరెడ్డి పద్మని నియమించారు.


ఇక త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాగే వచ్చే నాలుగున్నర ఏళ్లలో మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తెచ్చి, వారి మద్ధతుని వందశాతం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: