హైదరాబాద్ మెట్రోలో మరో  ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ నుండి మియాపూర్ వెళ్లే మెట్రో రైలులో ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ వద్ద మెట్రో డోర్ పై ఉన్న క్యాబిన్ ఊడి పడిందని సమాచారం అందుతోంది. మూడు వారాల క్రితం  అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర పెచ్చులూడి ఒక మహిళ మరణించిన ఘటన మరవకముందే హైదరాబాద్ మెట్రోలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. 
 
ఎల్బీనగర్ - మియాపూర్ మెట్రో రైలులో క్యాబిన్ ఊడి ప్రయాణికులపై పడగా రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవషాత్తూ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. మెట్రో రైలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు చేరుకునే సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మెట్రోకు రద్దీ పెరిగిన విషయం తెలిసిందే. 
 
హైదరాబాద్ మెట్రో రైలులో జరుగుతున్న ఘటనలతో మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులు కంగారు పడాల్సి వస్తుంది. మెట్రో అధికారుల నిర్వహణ లోపాలు ప్రయాణికుల పాలిట శాపాలు అవుతున్నాయి. కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న మెట్రోలో చిన్న తప్పిదం జరిగినా ప్రయాణికుల ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మెట్రో అధికారులు ఇకముందైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 
 
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన మెట్రో రైళ్లకు తాకిడి పెరిగిందని ఈరోజు జరిగిన ప్రమాదానికి కారణం జనం తాకిడేనని కూడా తెలుస్తోంది.అమీర్ పేట్ లో పెచ్చులూడి మహిళ మరణించి నెలరోజులు కూడా కాకమునుపే మరో ఘటన జరగటం ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తోంది. మెట్రో అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మెట్రో అధికారులు ఈ ప్రమాదం గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: