ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మేలు చేకూరే విధంగా మరో నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ వాహనమిత్ర పథకం కింద లబ్ధి పొందాలంటే ఆటో, క్యాబ్ నడుపుతున్న వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటేనే ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలు పొందటానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అర్హులు అయ్యేవారు. 
 
కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మేలు జరిగేలా నిబంధనలను మార్చింది. ఈ నిబంధనల ప్రకారం కుటుంబంలో ఎవరి పేరు మీద ఆటో, ట్యాక్సీ ఉన్నా ఈ పథకం కింద లబ్ధిదారుడిగా అర్హత సాధిస్తారు. లబ్ధిదారుడి తండ్రి, తల్లి, భార్య, కూతురు, తమ్ముడు ఎవరి పేరుతో ఆటో ఉన్నా పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుని పేరు, ఆటో రిజిస్టర్ అయిన కుటుంబ సభ్యుని పేరు వేరు వేరు రేషన్ కార్డుల్లో ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు. 
 
ఆటో యజమాని పేరుతోనే బ్యాంక్ అకౌంట్ ఉండాలనే నిబంధన మాత్రం విధించారు. గ్రామ వాలంటీర్, బిల్ కలెక్టర్, పంచాయతీ కార్యదర్శిలలో ఎవరో ఒకరు లబ్ధిదారుడికి ఆటో, క్యాబ్ యజమానికి మధ్య ఉండే బంధాన్ని ధ్రువీకరించాలి. గతంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైనా ధరఖాస్తు తిరస్కరణకు గురైన వారు ఉంటే వారు మరొకసారి ధరఖాస్తు చేసుకోవటానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 
 
ఈ నెల 30వ తేదీ లోపు ధరఖాస్తులు ఆన్ లైన్ లో అప్లై చేయవచ్చు. ఆన్ లైన్ లో ధరఖాస్తు చేయకపోతే గ్రామ వాలంటీర్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ లలో ఎవరో ఒకరికి నేరుగా ధరఖాస్తులు ఇచ్చే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. నవంబర్ 8వ తేదీలోపు ధరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి నవంబర్ 15వ తేదీన ప్రభుత్వం నగదు జమ చేయనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: