ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించటం కోసం గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించుకుంది. ఈరోజు ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న జుబేదా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శివ అనే కంప్యూటర్ ఆపరేటర్ చాలా రోజుల నుండి వేధిస్తూ ఉండటంతో వేధింపులు తాళలేక జుబేదా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. 
 
కంప్యూటర్ ఆపరేటర్ శివతో జుబేదాకు నిన్న రాత్రి 9 గంటల సమయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. డేటా ప్రజల నుండి జుబేదా సరిగ్గా సేకరించలేదని పరుషంగా, ఇష్టం వచ్చినట్లుగా శివ దూషించాడని తెలుస్తోంది. శివ దూషించడంతో మనస్థాపానికి గురైన జుబేదా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. జుబేదా మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 
 
సెప్టెంబర్ నెలలో పండువారిగూడెంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పండు నవీన అనే గ్రామ వాలంటీర్ ను ఒక మహిళ ఆధార్ ఆన్ లైన్ చేయటం లేదని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో పండు నవీన ఆధార్ ఆన్ లైన్ తన బాధ్యత కాదని మహిళకు నచ్చెజెప్పటానికి ప్రయత్నించింది. కానీ మహిళ అలాగే దుర్భాషలాలాడటంతో మహిళ ప్రవర్తనతో మనస్థాపానికి గురైన నవీన ఆత్మహత్య చేసుకుంది. 
 
ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టాల్సి ఉంది. అకారణంగా ఎవరైనా గ్రామ వాలంటీర్లను దూషిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రామ వాలంటీర్లుగా విధులు నిర్వహించేవారికి ప్రభుత్వం మానసిక స్థైర్యం పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆగష్టు నెల 15వ తేదీన గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరారు. విధుల్లో చేరిన రెండు నెలలలోనే రాష్ట్రంలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు మృతి చెందటం గమనార్హం. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: