ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. వివిధ రాజ‌కీయ పార్టీలు ఈ బంద్ విష‌యంలో త‌మ వైఖ‌రిని తెలిపాయి. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థమారెడ్డి స్పందిస్తూ...బంద్ సంపూర్ణంగా సాగిందన్నారు. ఆదివారం మళ్ళీ అఖిల సమావేశం ఉందని అన్నారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తామని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం భాద్యత వహించాలని కోరారు. ``ప్రజలకు పుష్పగుచ్ఛం ఇచ్చి మద్దతు కోరుతాము. ఎంఐఎం మద్దతు సైతం కోరుతున్నాము.  ఉస్మానియా మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించింది. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకోవాలి. చర్చలకు ప్రభుత్వం పిలుస్తే వెళ్తాము.  ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురుకుంటే అది ప్రభుత్వం భాద్యతే. మాతో టచ్ లో ఉన్న నేతలు సమ్మె గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. తండ్రిలా సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి.`` అని వెల్ల‌డించారు.  


మ‌రోవైపు, ప్ర‌భుత్వం స‌మ్మె విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది. బంద్ పిలుపు నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయించింది. బలవంతంగా బంద్‌చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చ‌రించ‌డ‌మే కాకుండా...ఆ రీతిలో వ్య‌వ‌హ‌రించింది కూడా. బంద్‌లో పాల్గొనేవారు హింసాత్మక చర్యలకు పాల్పడినా, సామాన్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయ‌డ‌మే కాకుండా...ప‌లువురిని అరెస్ట్ చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొనేలా చేసి...బస్‌డిపోలు, బస్టాండ్ల దగ్గర ప్రత్యేక నిఘా, పటిష్ఠ భద్రతతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో మౌంటెడ్ కెమెరా వాహనాలు అందుబాటులో ఉంచింది. స్థూలంగా బలవంతపు బంద్ జ‌రిగింద‌ని...అది కూడా నామ‌మాత్రంగా జ‌రిగింద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 


ఇదిలాఉండ‌గా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద‌యం నుంచే ఆర్టీసీ బస్ డిపోలు, బస్టాండ్ల దగ్గర కార్మికులు నిరసనలు, ధర్నాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సంఘాల నాయకులు, రాజకీయ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల  పోలీస్ వాహనాలతో ఎస్కార్టు పెట్టి మరీ బస్సులు నడిపించారు. ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటోలు బంద్‌లో పాల్గొనటంతో రోడ్లపై  ఎక్కడా ట్రాఫిక్ కనిపించటం లేదు. క్యాబ్ డ్రైవర్ల బంద్ తో ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్‌లోని రోడ్లు దాదాపు ఖాళీగా క‌నిపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: