జగన్ చిన్న వయసులోనే ఎన్నో బాధలు పడ్డారు. రాజకీయ కక్షలకు బలి అయ్యారు. ఎవరికీ జరగని విధంగా బెయిల్ కోసం పదహారు నెలల పాటు జైలు వూచలు లెక్కబెట్టారు. ఇక రాజకీయ చీకటి ఒప్పందాలు, వ్యూహాలకు కూడా బలి అయి ఆయన 2014 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు అవకాశం, జనామోదం తోడు అయి ముఖ్యమంత్రి అయ్యారు. మరి జగన్ మీద ఇపుడు కూడా కుట్రలు,  కుతంత్రాలు సాగుతున్నాయా..


అంటే నిజమేనని అంటున్నాయి పరిణామాలు. సీబీఐ కోర్టులో జగన్ ప్రతి శుక్రవారం హాజరు కావడం అన్న విషయమే రాజకీయ ఆయుధంగా మారుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు కూడా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవారు. ఇక ఆయన ఇపుడు ముఖ్యమంత్రి. మరి ఈ హోదాలో ఆయన జైలుకు వెళ్తే మాత్రం అది చూసేవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, పైగా ప్రతి శుక్రవారం ముఖ్యమంత్రి హోదాలో జగన్ బోను ఎక్కుతూంటే అది ఏపీ ప్రజల మీద పెను ప్రభావం చూపిస్తుంది.


అంతే కాదు, అటు అధికార యంత్రాంగం మీద, పోలీస్ వంటి వ్యవస్థల మీద కూడా పడుతుంది. ఏపీకి పెట్టుబడులు పెట్టేవారు సైతం ఓ ముఖ్యమంత్రి బోనులో నిలబడి ఉంటే రారని ఇదే టీడీపీ ప్రచారం చేసేందుకు ఉపయోగపడుతుంది. అందుకే జగన్ ఎందుకు కోర్టుకు వెళ్ళకూడదూ అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు. ఇక జగన్ విషయంలో మరిన్ని సెటైర్లు ఆయన వేశారు. జగన్ కోర్టుకు వెళ్తే  ప్రభుత్వ సొమ్ము కాక సొంత డబ్బు ఖర్చు చేయాలని కూడా సూచించారు.


మరో వైపు జగన్ ఇలా కోర్టుకు వెళ్ళడం వల్ల ఆయన‌ ఇమేజ్ డ్యామేజ్ అయితే దాని నుంచే రాజకీయ పునాదులు కట్టుకోవాలని చంద్రబాబు వంటి వారు ఎదురుచూడడంతో తప్పులేదు. ఇదిలా ఉండగా జగన్ తనకు వ్యక్తిగత మినహాయింపు  ఇవ్వాలని కోరిన దాని మీద సీబీఐ కోర్టులో జరిగిన వాదనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సీబీఐ పరుషమైన భాష ఉపయోగించడాన్ని జగన్ తరఫున న్యాయవాదులు తప్పుపట్టారు.


మొత్తానికి లాజిక్ కి అందని విషయాలను సీబీఐ విభాగం కోర్టు ముందుకు తెస్తోంది. జగన్ కోర్టుకు హాజరు కాకపోతే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేస్తారట. మరి మిగిలిన ఆరు రోజులు ఆయన కోర్టుకు రారు కదా, అపుడు సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉండదా. ఈ రకమైన వాదనలతో సీబీఐ జగన్ కి అవకాశం ఇవ్వరాదంటోంది. మరి నవంబర్ 1న  దీని మీద సీబీఐ కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: