తెలంగాణ హైకోర్టు కానిస్టేబుల్ వంటి పోస్టుల ఎంపికకు అభియోగాలు ఉన్నవారు అర్హులు కాదని, నేరాభియోగాలు నిరూపణ కాకపోయినా పోస్టుల ఎంపికకు అర్హులు కాదని పేర్కొంది. కృష్ణకుమార్ అనే వ్యక్తిపై నేరాభియోగాలు రావటంతో గతంలో పోలీస్ నియామక మండలి అతని ఉద్యోగాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం కృష్ణకుమార్ తనపై నమోదైన క్రిమినల్ కేసు కింది కోర్టు కొట్టేసిందని కానిస్టేబుల్ ఎంపికను పునరుద్ధరించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. 
 
కోర్టు కృష్ణకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చి క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకున్నట్లు నేరాభియోగాలు రుజువు కానంత మాత్రాన ఆ వ్యక్తిపై మచ్చ లేనట్లు కాదని పేర్కొంది. పోలీస్ నియామక మండలికి క్రిమినల్ కేసుల నేపథ్యం ఉన్నవారి ఎంపికను రద్దు చేసే అధికారం ఉందని జస్టిస్ పి.నవీన్ రావు తీర్పు చెప్పారు. నేరారోపణలు ఉన్నవారు కానిస్టేబుళ్లుగా ఎంపిక కావటం సరికాదని కోర్టు పేర్కొంది. 
 
కర్రా కృష్ణకుమార్ అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం రాయకల్ గ్రామం చలిగడ్డ తండా నుండి ఆర్మర్డు రిజర్వు కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. కానీ ఆ తరువాత కృష్ణకుమార్ కు ఒక క్రిమినల్ కేసులో పాత్ర ఉందని, నారాయణ ఖేడ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఉందని తెలిసిన అధికారులు ముందుగా నోటీసు ఇచ్చి కృష్ణ కుమార్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందక ఎంపిక జాబితా నుండి కృష్ణ కుమార్ పేరును తొలగించారు. 
 
కృష్ణకుమార్ మాత్రం తన సోదరుడు, తండ్రి తనపై పెట్టిన తప్పుడు కేసులను కింది కోర్టు గత ఏడాది కొట్టేసిందని కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని ధరఖాస్తు చేసుకున్నా పట్టించుకోకపోవటంతో రిట్ దాఖలు చేశానని చెప్పుకొచ్చాడు. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండి విచారణలో నిర్దోషులుగా నిరూపణ అయినవాళ్లు కూడా కానిస్టేబుల్ పోస్టులకు అనర్హులే అని, ఎంపికయ్యే వారిపై నేరారోపణలు కూడా ఉండకూడదని కోర్టు తీర్పులో పేర్కొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: