తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె ఊహించ‌ని రీతిలో ఉధృతి పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. 15 రోజుకు స‌మ్మె చేర‌డం, ఏకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వ‌డం తెలిసిందే. అదే ఒర‌వ‌డిలో మ‌రో స‌మ్మె తెర‌మీద‌కు వ‌చ్చే త‌రుణంలో....గులాబీ ద‌ళ‌ప‌తి దానికి విజ‌య‌వంతంగా చెక్ పెట్టారు.  విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు సమస్యలు ప‌రిష్కరించాల‌ని డిమాండ్ చేస్తూ...ఈ మేర‌కు స‌మ్మెకు దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కార్మికసంఘాలు ఆశాభావంతో చర్చలకు దిగగా.. యాజమాన్యాలు కూడా కార్మికులు తమ కుటుంబసభ్యులు అనేవిధంగా సానుకూలంగా స్పందించాయి. సమస్యల్లో వీలైనన్నింటిని పరిష్కరించేందుకు యాజమాన్యాలు హామీ ఇచ్చాయి. కార్మికసంఘాల డిమాండ్లలో కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించాయి. దీంతో అన్నిరకాల ఆందోళన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్టు విద్యుత్ కార్మికసంఘాలు ప్రకటించాయి.


విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు కార్మికుల డిమాండ్ల‌ను స‌వివ‌రంగా అధ్య‌యనం చేశాయి. ఆర్టిజన్ల సర్వీస్‌రూల్స్, 1999- 2004 మధ్య కాలంలో నియామకమైన కార్మికులు, ఉద్యోగుల జీపీఎఫ్‌కు సంబంధించిన ప్రధాన సమస్యలపై సానుకూలంగా  స్పందించారు. ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించడానికి అంగీకరించారు.చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా జరిగాయని, సీఎండీ ప్రభాకర్‌రావు సహృదయంతో కార్మికుల బాధలు అర్థం చేసుకుని, సమస్యల పరిష్కారానికి అంగీకరించారని తెలిపారు. ఆర్టిజన్ల కష్టాలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయని పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయిన నేపథ్యంలో తమ ఆందోళన కార్యక్రమాలన్నీ విరమించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు, కార్మికులు సంతకాలు చేశామ‌ని వెల్ల‌డించారు. 


కాగా, విద్యుత్ యాజమాన్యాలు తీసుకున్న చర్యలతో 23 వేల మందికిపైగా ఉన్న అర్టిజన్లకు సంపూర్ణ విముక్తి కలిగినట్టయింది. 4.12.2016 తరువాత చనిపోయిన ఆర్టిజన్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీక‌రించింది. దీంతోపాటుగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్, రెగ్యులేషన్స్‌పై ఒప్పందం కుదిరింది. ఆర్టిజన్ల పే ఫిక్సేషన్‌కు 1.10.2019 ప్రాతిపదికగా తీసుకుంటారు. వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, మెడికల్, కన్వీయెన్స్, కార్పొరేట్ అలవెన్స్‌లు నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. ఆర్టిజన్లకు పే స్లిప్పులు ఇస్తారు. వచ్చేవేతన సవరణ నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు ఇచ్చే సదుపాయాలన్నీ రెస్కో ఉద్యోగులకుకూడా వర్తిస్తాయి. 1.2.1999 నుంచి 31.8.2004 వరకు రిక్రూట్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్ అమలుకోసం టీ టఫ్ ప్రతినిధులను ముఖ్యమంత్రి వద్దకు యాజమాన్యం తీసుకెళుతుంది.  మిగిలిన డిమాండ్లపై నవంబర్ మూడోవారంలో సమావేశమై చర్చించ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: