నెల రోజులుగా జరుగుతున్న ప్రచారాలపోరు శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, బీజేపీ, సేన అతిరథ మహారథులు ఉధృతంగా ప్రచారం నిర్వహించగా, దాదాపు 5 దశాబ్దాల పాటు మహారాష్ట్రను ఏలిన కాంగ్రెస్‌ చతికిలపడి, తేలిపోయింది. ఇకపోతే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి 200 వరకు సీట్లు సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 78ఏళ్ల ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తనది ఆఖరి పోరాటమన్నట్లు ప్రజల్లోకి వెళ్లగా, ఆయనకు అండగా కాంగ్రెస్‌ నేతలెవరూ దీటైన ప్రచారం నిర్వహించలేకపోయారు. దీంతో బీజేపీ-శివసేన తిరుగులేని విజయం సాధించడం తథ్యమని తేలిపోయిందని స్పష్టం అవుతుంది.


నిజానికి బీజేపీ, శివసేన అభ్యర్థులు కనీసం 30 చోట్ల తిరుగుబాటు అభ్యర్థులను ఎదుర్కొంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ బలమైన నాయకత్వం లేకపోవడంతో వారి విజయాలను అడ్డుకోలేకపోతున్నారని పరిశీలకులు తెలిపారు. ఒక దశలో ఎన్సీపీలా కాంగ్రెస్‌ కూడా గట్టిగా ప్రచారం చేసి ఉంటే, బీజేపీ మళ్లీ సేనపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడేదని భావిస్తున్నారు. ఇలా ఉండగా, హరియాణాలో బీజేపీ ఘన విజయం తథ్యమని, 90 స్థానాలకు 83 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌ 3 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. పశ్చిమ మహారాష్ట్రలో 71 సీట్లకు బీజేపీ 24, శివసేన 13, ఎన్సీపీ 19, కాంగ్రెస్‌ 10, ఇతరులు 4 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ, శివసేన కలిసి దాదాపు 40 సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు అంటున్నారు.


గతంలో విదర్భలో బీజేపీ 44 గెలుచుకుంది. ఈ సారి 50 కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మిగతా చోట్ల బీజేపీ-సేన ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. గాంధీ కుటుంబం ఎదుర్కొంటోన్న అంతర్గత సంక్షోభానికి, పార్టీని పీడిస్తోన్న ఓటమి భయానికీ కాంగ్రెస్‌ ప్రచారసరళి అద్దం పడుతోందంటున్నారు నిపుణులు. ఇకపోతే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్, అశోక్‌ గెహ్లోత్, కమల్‌నాథ్‌ లాంటి హేమాహేమీలు సైతం ఈ రాష్ట్రాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభలో పాల్గొనలేదు. ఈ పరిస్దితులన్ని బీజేపీకి కలిసివచ్చిన అంశాలుగా పేర్కొంటున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: