వరుస ప్రమాదాలు హైదరాబాద్ మెట్రో ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయి. మెట్రో స్టేషన్ పై నుండి ప్లాస్టిక్ పైపు ఊడి పడిన ఘటన జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్ దగ్గర చోటు చేసుకుంది. పైప్ కింద పడినప్పటికీ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవటం వలన ఎటువంటి ప్రమాదం ఐతే జరగలేదు. కొన్ని రోజుల క్రితం అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి కింద పడటంతో వివాహిత మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే మెట్రో రైళ్లలో, మెట్రో స్టేషన్ లలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతూ ఉండటంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. రెండు రోజుల క్రితం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో క్యాబిన్ ఊడిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ ఘటన మరవకముందే మెట్రో స్టేషన్ పై నుండి పైపు కింద పడటం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏవైనా లోపాలు ఉంటే సరి చేస్తామని చెబుతున్నప్పటికీ మెట్రో నిర్మాణంలోని భాగాలు ఊడి పడుతూ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో అధికారులు మెట్రో నిర్మాణాల్లోని లోపాలను వెంటనే సరి చేయాలని  ప్రయాణికులు కోరుతున్నారు. 
 
మెట్రో అధికారులు ప్రయాణికుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత చర్యలు తీసుకుంటున్నారని అలా కాకుండా ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వరుస ప్రమాదాల వలన మెట్రో ప్రతిష్టకు భంగం కలుగుతోందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో అధికారులు ప్రమాదాలు జరగకుండా ఇకనుండైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: