తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవ‌కాశ‌వాద రాజకీయాల‌కు సుప‌రిచిత చిరునామా అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్ మండిప‌డ్డారు. నిజాయితీ,పారదర్శకమైన పాలన అందించాలని ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్  ముందుకు వెళ్తున్నారని, తాము కూడా అదే అనుసరిస్తున్నామ‌ని అనిల్ స్ప‌ష్టం చేశారు ఆయనకు అండగా ఉండాలని,ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నామ‌ని తెలిపారు. చంద్ర‌బాబు త‌న మేనిఫెస్టోను టిష్యూపేపర్ వ‌లే చెత్తకుప్పలో పడేశారని, తాము మాత్రం త‌మ మేనిఫెస్టో భగవద్గీత,ఖురాన్,బైబిల్ వ‌లే గొప్ప‌గా భావిస్తూ...ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేస్తున్నామ‌న్నారు. 


ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ లలో రివర్స్‌ టెండరింగ్‌ సక్సెస్‌ అయిందని మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్ స్ప‌ష్టం చేశారు. ``పారదర్శకంగా టెండరింగ్‌ ప్రక్రియ జరగాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం. ఇరిగేషన్‌ శాఖలో దాదాపు వేయి కోట్ల రూపాయలు ఆదా చేశాం. త్వరలో హౌసింగ్,మున్సిపల్‌ శాఖలలో కూడా రివర్స్‌ టెండరింగ్ చేప‌ట్ట‌నున్నాం. వెలిగొండప్రాజెక్ట్‌ ద్వారా 61 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఇదే రిత్విక్‌ సంస్ద 4.69 శాతం ఎక్సెస్‌ కు వెలిగొండ కట్టబెట్టారు. ఈరోజు రివర్స్‌ టెండరింగ్‌ లో లెస్‌ టెండర్‌ వేసి పాల్గొన్నారు. 


గత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్తే వేలకోట్లు ఆదా అయ్యేవని మంత్రి వివ‌రించారు. ``ఇప్పటికే వేయి కోట్లు మిగలగా రాబోయే రోజులలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మరో 500 కోట్లు మిగులుతాయి. కమీషన్ల కోసం ఇష్ట వచ్చినట్లు నిబంధ‌నలు పెట్టి చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్నవారికి టెండర్లు కేటాయించారు. మా ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ కు వెళ్లక పోతే ఈ 1500 కోట్లు ఎవరి జేబులలోకి వెళ్లి ఉండేవి? ఎక్సెస్‌ టెండర్ల ద్వారా చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారు. రివర్స్‌ టెండరింగ్‌ లో వందలకోట్లు ఆదా అవుతుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు.`` అని మండిప‌డ్డారు. ``రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు ఇవ్వడం మంచిదంటారా?రేట్లు తగ్గించి పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వడం మంచిదా? రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా అవుతున్న మొత్తాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగిస్తాం.``అని ప్ర‌క‌టించారు.


మేనిఫెస్టోలో చెప్పినవి చేస్తున్నామ‌ని మంత్రి అనిల్ స్ప‌ష్టం చేశారు. ``50 లక్షల మందికి రైతు భరోసా అమలు చేయడం,ఆటోడ్రైవర్లకు పదివేలు ఇవ్వడం,ఆశావర్కర్లకు మూడు నుంచి పదివేలు ఇవ్వడం తప్పంటే ఎలా? చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం,రాష్ట్ర ప్రజలు ఈసారి మూడో నాలుగో ప్లేస్‌ కు పరిమితం చేస్తారు.వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక డ్యామ్‌ లు నిండాయి.పంటలు పండి కళకళలాడుతున్నాయి. కృష్ణా,గోదావరినదులలో వరదలు రావడంతో ఇసుక లభ్యతలో ఇబ్బంది ఏర్పడింది.త్వరలోనే ఇసుక సమస్యకు పరిష్కారం చూపుతాం.``అని స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: