ఊహించిందే జ‌రిగింది. తెలుగుదేశం పార్టీకి మ‌రో ముఖ్య నేత గుడ్‌బై చెప్పారు. ఇటీవ‌ల జరిగిన ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి చేతిలో 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు.  బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆదినారాయ‌ణ రెడ్డి ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకొన్నారు. దీంతో క‌డ‌ప జిల్లాలో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో, క‌డ‌ప జిల్లాల్లో టీడీపీకి షాక్ త‌గిలింది.


2014 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన ఆది నారాయ‌ణ రెడ్డి గెలిచారు. ఆ త‌రువాత అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఫ‌లితంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ పై అస్త్రంగా అవ‌స‌ర‌మైన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ టీడీపీ ఆదినారాయ‌ణరెడ్డిని ఉప‌యోగించుకుంది. టీడీపీలో చేరడం, మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న అనంత‌రం ఆది జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంత‌రం ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌డప పార్ల‌మెంట్‌పై దృష్టి పెట్టిన చంద్ర‌బాబు అక్క‌డ నుండి మంత్రిగా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డిని బ‌రిలోకి దించారు. టీడీపీ అభ్య‌ర్థిగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ఆది వైసీపీ నేత చేతిలో ఘోరంగా ఓట‌మి పాల‌య్యారు. 


మ‌రోవైపు...ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డం, వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావ‌డంతో ఆది డైలమాలో ప‌డిపోయారు. రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం పార్టీని న‌మ్ముకుంటే లాభం లేద‌ని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే మేల‌ని ఆది నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ...ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. క‌డ‌ప జిల్లాలో బీజేపీని బ‌లోపేతం చేసేందుకు ఆది ఏం చేయ‌నున్నారు?  మునుప‌టి దూకుడునే ప్ర‌ద‌ర్శిస్తారా? అనేది ప్ర‌స్తుతం ఆస‌క్తిని రేకెత్తించే అంశం.క‌డ‌ప జిల్లాలో టీడీపీకి బలం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో కూడా క‌డ‌ప జిల్లాలో ప‌ది సీట్ల‌ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: