ఐదు కోట్ల మంది ఆంధ్రుల‌కు ఐకాన్‌గా నిల‌వాల్సిన రాజ‌ధాని ప‌రిస్తితి ఏంటి? ఇప్పుడు రాజ‌ధాని భ‌విత‌వ్యం ఏంటి? ఎలా ఉంది? అస‌లు రాజ‌ధాని మాటెత్తే నాధుడు కూడా లేక పోవ‌డం, ప్ర‌భుత్వం నుంచి దీనిపై క్లారిటీ లేక‌పోవ‌డంతో ఇప్పుడు సామాన్యుల నుంచి మేదావుల వ‌ర‌కు కూడా ఇలాంటి ప్ర‌శ్న‌లే తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఉమ్మ‌డి ఏపీ రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌ను రెండు రాష్ట్రాల‌కు క‌లిపి ప‌దేళ్ల‌పాటు రాజ‌ధానిని చేశారు. అయితే, ఇప్పుడు ఐదేళ్లు గ‌డిచి పోయాయి. మ‌రో నాలుగున్న‌రేళ్ల‌లో ఇది కూడా ర‌ద్ద‌యిపోయేలోపు.. ఏపీకి కొత్త రాజ‌ధాని అస‌వ‌రం ఎంతైనా ఉంది.


అయితే, గ‌డిచిన ఐదేళ్ల కాలంలో రాజ‌ధానిపై ఎక్కువ‌గానే దృష్టి పెట్టిన చంద్ర‌బాబు ఈ మేర‌కు చేసింది ఏమైనా ఉందా?  ఆయ‌న కాలంలో ఆయ‌న చేసిన హ‌డావుడి ఫ‌లించి ఉంటే.. ఇప్పుడు పైన వ‌చ్చిన విధంగా ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చేవి కాదు. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో ఆయ‌న భూ స‌మీక‌ర‌ణ చేశారు. అదేస‌మ యంలో ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మిస్తామంటూ.. హ‌డావుడి కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే సింగ‌పూర్‌, జ‌పాన్‌ల నుంచి మేధావులు, ఆర్కిటెక్టుల‌ను ర‌ప్పించి ఇక్క‌డ అనేక డిజైన్ల‌ను రూప‌క‌ల్పన చేయించారు. అయితే, ఇదే పెద్ద గొప్ప అనుకున్నారో ఏమో.. కీల‌క‌మైన నిర్మాణాల దిశ‌గా మాత్రం ఆలోచ‌న చేయ‌లేక పోయారు.


వాస్త‌వానికి చంద్ర‌బాబు ఆనాడే కీల‌క నిర్మాణాలు ప్రారంభించి ఉంటే.. ఇప్పుడు రాజ‌ధాని మారుస్తారా?  అ భివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పేరుతో రాష్ట్రంలో రాజ‌ధానిని నాలుగు దిక్కుల్లో ఏర్పాటు చేస్తారా? అనే సందేహా లు వ‌చ్చి ఉండేవి కావు. కానీ, చంద్ర‌బాబు రాజ‌ధానిని రెండు వ్యూహాల్లో త‌న‌కు అనుకూలంగా మార్చుకు న్నారు. దీనిని ప్రోలాంగ్ చేయ‌డం ద్వారా.. రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని ఆయ‌న భావించిన విష‌యం వాస్తవం. మ‌రోసారి తాను అధికారంలోకి వ‌చ్చేందుకు రాజ‌ధాని నిర్మాణాల‌ను ఆయ‌న తురుపు ముక్క‌గా భావించారు. ఇప్పుడు మొద‌లు పెట్టిన‌ట్టే పెట్టి.. ఎన్నిక‌ల్లో దీనిని ప్ర‌చారం చేయ‌డం ద్వారా .. తాను త‌ప్ప రాజ‌ధానిని నిర్మించ‌లేర‌నే స్థాయికి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాల‌ని అనుకున్నారు.


ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే వ్యూహాన్ని అమ‌లు చేశారు. కానీ, ప్ర‌జ‌లు తాత్కాలిక నిర్మాణాలు, చిన్న వ‌ర్షానికే మ‌డుగులు క‌ట్టిన రాజ‌ధాని భ‌వ‌నాల‌తో విసిగెత్తిపోయారు. మ‌రోప‌క్క‌, ఎలాంటి శాశ్వ‌త నిర్మాణాలు చేయ‌క పోవ‌డం, త‌న అనుకున్న వారికి భూములు పందేరం చేసిన‌ట్టు వార్త‌లు రావ‌డంతో బాబుపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్లింది. దీంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. ఆయ‌న ఆది నుంచి ప్ర‌చారం చేసిన‌ట్టు ఇక్క‌డ భూముల‌పై ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని, ఓ సామాజిక వ‌ర్గానికి మేలు చేసేందుకే చంద్ర‌బాబు ఇక్క‌డ రాజ‌ధాని నిర్మాణాన్ని చేప‌ట్టార‌నే విష‌యాల‌పై ఆయ‌న ఇప్పుడు త‌వ్వి తీస్తున్నారు.


ఫ‌లితంగా ఇప్పుడు రాజ‌ధాని గురించి మాట్లాడేవారు అటుంచితే.. ప్ర‌భుత్వ ప‌రంగా దీనిపై ప్ర‌క‌ట‌న చేసే వారు కూడా క‌రువ‌య్యారు. అడ‌పా ద‌డ‌పా మంత్రి బొత్స స‌త్య‌నారాయణ మాట్లాడుతున్నా.. ఆయ‌న ప్ర‌క‌ట‌నలు.. అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఫ‌లితంగా రాష్ట్ర శాశ్వ‌త హైకోర్టు త‌మ ప్రాంతంలోనే నిర్మించాలంటూ.. సీమ ప్రాంతం నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి రాజ‌ధాని ప్రాంతంలోని మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టులు మా ప్రాంతానికే రావాల‌ని అక్క‌డివారు ప‌ట్టుబ‌డుతున్నారు.


ఇలా మొత్తంగా రాజ‌ధాని పాపం ఇప్పుడు బాబు నిర్వాకం వ‌ల్లే ఇలా త‌యారైంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నాడే.. ఆయ‌న ఎన్నో కొన్ని శాశ్వ‌త నిర్మాణాలు చేయించి ఉంటే.. ఇప్పుడు రాజ‌ధానిని మారుస్తామ‌నే సాహ‌సం, మార్చాల‌నే డిమాండ్లు కూడా తెర‌మీదికి వ‌చ్చేవి కావు. మ‌రోప‌క్క‌, రాజ‌ధానికి కేంద్రం ఇచ్చిన నిధుల‌కు కూడా లెక్క చెప్ప‌లేని ప‌రిస్థితి నేడు నెల‌కొన‌డం మ‌రింత దారుణంగా ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: