తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో సెప్టెంబర్ నెల 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు పైకప్పును ధర్మాడి సత్యం బృందం బయటకు తీసింది. ధర్మాడి సత్యం బృందం సభ్యులు ఈరోజు సాయంత్రంలోపు బోటును పూర్తిగా బయటకు వెలికితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని శివ భక్తులు బోటు ప్రమాదానికి శివుని ఆగ్రహమే కారణమని చెబుతున్నారు. 
 
ఈ గ్రామాలలో నివసించే వారు గోదావరి నదిలో బోటు ప్రమాదాలు ఎక్కువగా 15వ తేదీనే జరుగుతాయని, ఆ ప్రమాదాలు కూడా పౌర్ణమి లేదా అమవాస్య రోజుల్లో మాత్రమే జరుగుతాయని చెబుతున్నారు. గత సంవత్సరం మే నెల 15వ తేదీన వాడపల్లి - మంటూరు సమీపంలో గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. లాంచీ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. 
 
గతంలో మే 15వ తేదీన ఆరుగురు లాయర్లు బోటు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. 1971 సంవత్సరం, 1956 సంవత్సరంలో కూడా బోటు ప్రమాదాలు 15వ తేదీనే జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాయల్ వశిష్ట బోటు మునిగిపోయిన ప్రదేశానికి కొంత దూరంలోని కొండల్లో శివాలయం ఉంది. పాపికొండలకు గోదావరి నదిలో బోటులో, లాంచీల ద్వారా రాకపోకలు చేసేవారు కొండల్లో ఉన్న శివుడిని దర్శించుకుంటారు. 
 
15వ తేదీన మాత్రమే గోదావరి నదిలో ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో మహాశివుడి ఆగ్రహం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గోదావరి నదికి దగ్గరగా ఉండే గ్రామాలలోని గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. నిన్న బోటు కదలటంతో బోటు నుండి బ్లాక్ జీన్స్ ప్యాంట్ ధరించిన ఒక మహిళ తల లేని మొండెం బయటపడింది. ఈరోజు బోటు బయటకు తీస్తారనే ప్రచారం జరగటంతో భారీ సంఖ్యలో స్థానికులు బోటు వెలికితీసే ప్రదేశానికి చేరుకొని బోటు కోసం ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: