చంద్రబాబునాయుడుకు తొందరలోనే మరో షాక్ తప్పేట్లు లేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సూత్రం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అందుకనే ఉప్పు-నిప్పు లాంటి ఫ్యాక్షన్  నేతలిద్దరినీ ఒకే చోటకి తెచ్చారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేశానని చెప్పుకున్నారు. కానీ ఇపుడా ఇద్దరు కలిసే చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

 

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరని అనుకుంటున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని నేతలు ఆది నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి. వీళ్ళల్లో ఆది నారాయణరెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీకి వెళ్ళి మరీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అదే పద్దతిలో మరో నేత రామసుబ్బారెడ్డి కూడా తొందరలోనే టిడిపికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరగుతోంది.

 

తాజాగా  అంటే సోమవారం ఉదయం  ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డిని రామసుబ్బారెడ్డి కలిసి మాట్లాడారట. నిజానికి ఈ ఇద్దరికీ ఏమాత్రం పడదు. అయితే వైసిపి తరపున గెలిచిన ఆది టిడిపిలోకి ఫిరాయించటంతో రామసుబ్బారెడ్డి టిడిపిలో నుండి వైసిపిలోకి వచ్చేస్తానని గతంలోనే రాయబారం పంపారు. అయితే అప్పట్లో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 

కారణాలు ఏవైనా మొన్నటి ఎన్నికల్లో ఆది నారాయణరెడ్డి  కడప ఎంపిగా పోటి చేయగా రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ఎంఎల్ఏగా పోటి చేశారు. వైసిపి దెబ్బకు ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుండి ఇద్దరు కూడా టిడిపిలో ఇమడలేకపోతున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టిడిపికి భవిష్యత్తు లేదని ఇద్దరు తమ మద్దతుదారులతో సమావేశాలు పెట్టినపుడు స్పష్టంగా చెప్పారట. ఈ నేపధ్యంలోనే ఆది బిజెపిలో చేరిపోవటంలో టిడిపికి రామసుబ్బారెడ్డి ఒక్కడే దిక్కయ్యాడు. అలాంటిది ఆయన కూడా తొందరలోనే టిడిపికి రాజీనామా చేసేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపధ్యంలోనే జగన్ తో మాట్లాడటం జిల్లాలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరి రామసుబ్బారెడ్డి లాంఛనం ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: