మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. అర్బన్ ఏరియాల్లో ఓటేసేందుకు జనం అనాసక్తి చూపించగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మోస్తరుగా ఓటర్లు తరలివచ్చారు. దాంతో మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ పర్సంటేజ్‌ అంతంతమాత్రంగానే నమోదైనట్లు తెలుస్తోంది ఇక, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బీహార్‌, కేరళల్లో 5 చొప్పున అసోం, పంజాబ్‌లో నాలుగేసి చొప్పున అలాగే తమిళనాడు, రాజస్థాన్‌, హిమాచల్‌లో రెండేసి స్థానాలకు పోలింగ్ జరిగింది.


అదేవిధంగా, సిక్కింలో మూడు అరుణాచల్‌, ఛత్తీస్‌‌గఢ్‌, మధ‌్యప్రదేశ్‌, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరి, తెలంగాణల్లో ఒక్కో స్థానానికి బైపోలింగ్ ముగిసింది. ఇకపోతే  ఓ వైపు వర్షం.. మరోవైపు పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌కు తీవ్ర ఆటంకం ఎదురైంది. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయానికి కేవలం 44శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది.  పుణెలోని శివాజీనగర్‌లో పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొవ్వొత్తుల వెలుగులోనే అధికారులు పోలింగ్‌ నిర్వహించారు. తమ టేబుళ్లపై కొవ్వొత్తులు పెట్టుకుని ఆ వెలుగులోనే పోలింగ్ సిబ్బంది ఓటర్ల జాబితాను సరిచూసుకున్నారు. ఓటర్లు కూడా ఆ వెలుగులోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


దీనిపై స్థానిక ఎన్నికల నిర్వహణ సిబ్బంది మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు విద్యుత్‌ సరఫరా లేదని.. మీటర్‌లో ఇబ్బంది ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఎన్నికల సంఘం జనరేటర్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు.ఈ పరిస్థితి దాదాపు ఎనిమిది పోలింగ్ కేంద్రాల పరిధిలో వుంది. మరోవైపు, భారీ వర్షం కారణంగా పూణెలోని ఓ పోలింగ్‌ కేంద్రం ప్రాంగణమంతా బురదమయం అయింది. దీంతో అక్కడి అధికారులు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఇబ్బంది లేకుండా ట్రాక్టర్ల ట్రాలీలను ఓ వంతెనలా అమర్చారు. దానిపైనుంచి ఓటర్లు వెళ్లి ఓట్లు వేశారు. మొత్తానికి ఇక్కడ పోలింగ్ ఓ మోస్తారుగానే జరిగిందని చెప్పవచ్చూ. ఇకపోతే ఈ నెల 24 న రిజల్ట్‌ను ప్రకటించనున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: