తెలంగాణా ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఇపుడు హుజూర్ నగర్ ఈవీఎం లలో నిక్షిప్తం అయిందా. అక్కడ గెలుపు ఓటములు ఆర్టీసీ సమ్మెను డిసైడ్ చేస్తాయా. గెలిస్తే ఒక రకంగా ఓడితే మరో రకంగా ఫలితాలు ఉంటాయా. ఇదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. నిజానికి అలా జరగలేదు. ఆర్టీసీ సమ్మెకు ముందే ఉప ఎన్నిక ప్రకటన వచ్చింది. అయితే ఈ  ఉప‌ఎన్నికను చూసుకునే ఆర్టీసీ కార్మికులు తెలివిగా సమ్మె బాటలోకి నడిచారని కూడా మరో వైపు కామెంట్స్ ఉన్నాయి.


ఏది ఎలా ఉన్నా కూడా ఇటు ఆర్టీసీ యూనియన్లు, ఇటు టీయారెస్ ప్రభుత్వం రెండూ కూడా ఉప ఎన్నికలపైనే ద్రుష్టి పెట్టాయన్నది మాత్రం వాస్తవం. ఎందుచేతనంటే  కార్మికులు కూడా జనజీవనంలో భాగమే. అందువల్ల ప్రజల నాడి ఎలా ఉందో ప్రభుత్వానికి ఇక్కడ అవసరం. అదే విధంగా తమ ఆకలి గోడుకు ప్రజలు కూడా సహకరిస్తే  మరింత బలం వస్తుందన్నది కార్మిక సంఘాల భావన. ఏది ఏమైనా ఇపుడు హుజూర్ నగర్ ఓటింగ్ జరిగిపోయింది. తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. 24న ఫలితాలు వస్తాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీయారెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. దానికి తోడు అక్కడ కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిందని, ఆర్టీసీ కార్మికుల సమ్మె వూసే లేదని, లోకల్ ఇష్యూస్ ప్రధాన పాత్ర పోషించాయని అంటున్నారు. అలాగే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉందని కూడా అంటున్నారు.


ఈ నేపధ్యంలో నుంచి చూసుకున్నపుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కేసీయార్ అస‌లే మొండివారని పేరు. దానికి తోడు ఉప ఎన్నిక ఫలితం కూడా అనుకూలంగా వస్తే ఆయన తనదైన యాక్షన్ ప్లాన్ బయటకు తీస్తారని కూడా అంటున్నారు. ఇంతవరకూ కేసీయార్ కాస్త మెత్తగా ఉండడం వెనక ఉప ఎన్నిక లొల్లి ముందు ఉండడమేనని అంటున్నారు. మరి అదే జరిగితే కేసీయార్ యాక్షన్ ఎలా ఉంటుంది, సమ్మెకు నూరేళ్ళు తీరిపోతాయా. ఓడిపోయి ఆర్టీసీ ఉద్యోగులు విధులకు వెళ్తారా. లేక కడవరకూ పోరాడాలనుకుంటే పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయి అన్నది పెద్ద చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: