వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలుపుతూ 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేవదాయ శాఖ చట్టానికి చట్ట సవరణ తీసుకొచ్చారు. దీనికనుగుణంగా పూర్తి విధివిధానాలతో తుది ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ ముగియక ముందే ఆయన దివికేగారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అర్చకులను మోసం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తానని హామీ ఇచ్చారు.


ఒక గుడిని నమ్ముకొని దశాబ్దాలపాటు అర్చకత్వం చేసుకుంటూ జీవించే అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. అలాంటి ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.ఏదైనా ఆలయంలో అర్చకులుగా చేరినవారి కుటుంబాలకు ఆ ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వం చేసుకోవడానికి అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి తమ ఆలయ వివరాలతో దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.


ఏ ఆలయానికి ఎవరు వంశపారంపర్య అర్చకత్వానికి అర్హులో తేల్చుతూ దేవదాయ శాఖ కమిషనర్‌ పారదర్శకంగా ఒక జాబితాను తయారు చేస్తారు. అర్హత ఉన్న అర్చకులు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, కుటుంబ వారసత్వ పట్టిక, అందుకు సంబంధించిన అఫిడవిట్లను దేవదాయ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వంశపారంపర్య అర్చకత్వానికి గుర్తింపు పొందిన వారు.. తమ తదనంతరం వారసులుగా ఎవరు కొనసాగుతారో తెలపాలి.


పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే పరిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. దివంగత సీఎం వైఎస్సార్‌ చేసిన చట్టాన్ని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే వరకు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: