వివాదాస్ప‌ద ఆధ్యాత్మిక గురువు కల్కీ భగవాన్ ఎట్ట‌కేల‌కు ఎంట్రీ ఇచ్చారు. అక్రమాస్తులు సంపాదించారనే సమాచారంతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నాలుగు రోజులు దాడులు జరప‌డం...ఈ దాడుల్లో  రూ.44కోట్ల నగదు, రూ.20కోట్ల విదేశీ కరెన్సీ , వైట్ లోటస్ అనే పేరుతో తన కుమారుడి పేరుమీద చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చిత్తూరు, కుప్పంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఐటీ అధికారులు  వెల్ల‌డించ‌డం తెలిసిన సంగ‌తే. అంతేకాకుండా, ఐటీ దాడులతో కల్కీ భగవాన్ విదేశాలకు పారిపోయారని, ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై తాజాగా క‌ల్కీ క్లారిటీ ఇచ్చాడు.తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలో ఉన్నామంటూ మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. 


భోదనలు జరిగే చెన్నై నేమంలోనే ఉన్నట్లు కల్కీ తెలిపాడు. కల్కీ తానెక్కడికి పారిపోలేదని చెప్ప‌డమే కాకుండా ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తమ ఆరోగ్యం బావుందన్న కల్కీ దంపతులు తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటిలాగే ఆశ్రమంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని.. తమను నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటామని ఆ వీడియోలో తెలిపారు. అయితే, నాలుగు రోజులుగా కల్కి భగవాన్ ఆశ్రమాలపై జరుగుతున్న ఐటీ దాడులపై మాత్రం ఆయన మాట్లాడలేదు. 


ఇదిలాఉండ‌గా, ఎల్ఐసీ క్లర్కు గా జీవితాన్ని ప్రారంభించిన కల్కీ బాబా అలియాస్ విజయ్ కుమార్ నాయుడు...1990లలో తానొక మహా విష్ణు అవతారమని ప్రకటించుకొని ఫేమస్ అయ్యారు. కల్కిభగవాన్‌ ఆశ్రమం ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు విస్తరించింది. ఆశ్రమంలో దాదాపు 1500 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఏటా సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ, ఐటీ రిటర్న్‌ దాఖలు చేస్తున్న కల్కిభగవాన్‌ గత మూడేండ్లుగా పన్నులు చెల్లించడం లేదని, ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలు చేయడం లేదని సమాచారం. అలాగే సంస్థలకు ఉన్న కల్కి పేరును కూడా మార్చారు. ‘ఏకం’తో పాటు పలురకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టారు. చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆశ్రమాలు, కార్యాలయాలు, భూముల కొనుగోళ్లు, విరాళాల సేకరణలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: