తెలంగాణలో హుజూర్ నగర్ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో 84.75 పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. అయితే ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో 24న తేలిపోనుంది. కాకపోతే ఎన్నిక ముగియగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో టీఆర్ఎస్ దే గెలుపు అని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం కానుందని చెప్పాయి.


ఇక ఈ రెండు పార్టీలకు పోటీగా నిలబడిన టీడీపీ, బీజేపీలు డిపాజిట్లు కోల్పోనున్నాయని వెల్లడించాయి. టీడీపీ తరుపున చావా కిరణ్మయి పోటీ చేయగా, బీజేపీ తరుపున కోట రామారావు పోటీ చేశారు. అసలు బలం లేదని తెలిసి కూడా ఈ రెండు పార్టీలు అభ్యర్ధులని పోటీకి దించాయి.  ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఈ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావితం చేయలేదని తేలిపోయింది. అసలు ఫలితం కూడా ఇంచుమించు అలాగే వచ్చే అవకాశముంది.


అయితే టీడీపీ, బీజేపీలు పోటీ చేయకుండా ఉంటేనే పరువు దక్కేది. అనవసరంగా పోటీ చేసి పరువు పోగొట్టుకున్నాయి. వీళ్ళకు ఎగ్జిట్ పోల్స్ లో 5 శాతం ఓటింగ్ కూడా దాటలేదు. దాదాపు అన్నీ సర్వేలలో టీడీపీకి అత్యధికంగా 4.8 శాతం వస్తే, బీజేపీకి 2.4 శాతం వచ్చింది. మిగతా సర్వేలు అన్నీ రెండు పార్టీలకి 3 శాతం లోపే ఓట్లు వస్తాయని చెప్పాయి. దీని బట్టి చూస్తుంటే డిపాజిట్ కోల్పోవడంతో పాటు ఘోరంగా ఓడిపోనున్నాయి. మామూలుగా డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు దక్కించుకోవాలి.


హుజూర్ నగర్ లో 2 లక్షల ఓట్లు వరకు పోలయ్యాయు. అంటే దాదాపు 33 వేల ఓట్ల పైనే తెచ్చుకుంటే డిపాజిట్ దక్కించుకుంటాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ చూస్తే టీడీపీకి 5 వేల ఓట్లు కూడా రావడం కష్టమే. అటు బీజేపీకి 3 వేలు ఓట్లు వస్తే గొప్పే. మొత్తానికి రెండు పార్టీలు అనసవరంగా పోటీ చేసి పరువు పోగొట్టుకున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: