ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తుపాను రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక అందడం లేదని.. ఇసుక విధానం రూపొందించడంలో జాప్యం చేసినందువల్ల లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పస్తులు పడుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై టీడీపీ పలు దీక్షలు కూడా చేసింది. అయితే ఇసుక కొరతకు వైసీపీ చెబుతున్న కారణాలు వేరుగా ఉన్నాయి.


నదుల్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇసుక సేకరణకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, దీనిపై కూడా చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఎప్పుడూ లేని విధంగా పొంగిపొర్లుతున్నాయన్నారు. దీంతో రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారని, మరో పక్క ఇసుక కావాల్సిన వారికి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.


ఇబ్బందులను అధిగమించి వినియోగదారులకు ఇసుక అందజేస్తామని చెప్పారు. ఇసుక అంతా కొట్టుకుపోయిందని, ప్రభుత్వ నూతన ఇసుక విధానంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు, ఆయన తాబేదారులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష క్యూబిక్‌ మీటర్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. వరదల కారణంగానే ఇసుక లభ్యత కొరవడిందని ప్రజలంతా ఆలోచించాలి.


బాబు ఉన్నప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇసుకను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ఇసుక దోపిడీ వల్ల బోటు మునిగిన సంగతి తెలిసింది. చంద్రబాబు ఇసుక దోపిడీపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ రూ.వంద కోట్ల జరిమానా గతంలో విధించింది. ఆ విధంగా కాకుండా ఎవరికీ ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఇసుక ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. గత ఐదేళ్లు చంద్రబాబు ఇసుకను ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఆ ఇసుక వల్లే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: