జగన్ సర్కార్ మెల్లగా అయిదవ నెలలోకి ప్రవేశిస్తోంది. కొత్త ప్రభుత్వం, పాలన గాడిలో పడుతున్నాయి. జగన్ కి అటు అధికారులకు మధ్య ఓ బంధం ఏర్పడింది. పనిచేసే వారేవరో, పరవారు ఎవరో కూడా మెల్లగా తెలిసివస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటూనే ఒక్కో సమస్యను జగన్ పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన‌వీ, చెప్పనివీ కూడా హామీలు నెరవేరుస్తున్నారు. కానీ..


ఒకే ఒక సమస్య ఇసుక మాత్రం జగన్ సర్కార్ కి తేవాల్సిన చెడ్డ పేరు తెచ్చేస్తోంది. ఇక ఇసుక పేరిట దుమ్మెత్తిపోయడానికి విపక్షం రెడీగా ఉంది. మొత్తానికి చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు విమర్శించేందుకు ఏ ఒక అవకాశం లేదు. దాంతో తలపండిన చంద్రబాబు నుంచి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పవన్ సైతం ఇసుక మీదనే రాజకీయం మొదలెట్టేస్తున్నారు. ఈ నెల 24న ఇసుక మీద చంద్రబాబు ఆద్వర్యంలో టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళలనకు పిలుపు ఇచ్చింది. ఇక మరో వైపు నవంబర్ 3న ఇసుక మీద విశాఖలో పవన్ నాయకత్వంలో భారీ ర్యాలీకి కూడా పిలుపు ఇచ్చారు. ఇలా విపక్షాలు ఇసుకనే ఆయుధంగా చేసుకుని దుమ్ము దులపాలనుకుంటున్నారు. దీని మీద ప్రతి రోజూ రివ్యూ చేస్తున్న జగన్ మాత్రం తగిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.


దానికి కారణం గత రెండు నెలలుగా అదే పనిగా కురుస్తున్న వర్షాలు. దాంతో ఇసుక రీచులన్నీ వరదలతో ముంచెత్తి ఉన్నాయి. ఈ పరిణామం వల్లనే ఇసుక కొరత తప్ప మరేమీ కాదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొస్తున్నారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా పది కోట్ల టన్నుల ఇసుక ఉందని, ఏపీకి ఏడాదికి రెండు కోట్ల టన్నుల ఇసుక అవసరం పడుతుందని, ఆ లెక్కన అయిదేళ్ళకు సరిపడా ఇసుక తమను అందుబాటులో ఉందని ఆయన అంటున్నారు. వానలు తగ్గిన తరువాత ఇసుక కొరత అన్నది లేకుండా చర్యలు చేపడతామని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా అంతవరకూ ప్రతిపక్షాలు ఆగుతాయా. రాజకీయం చేస్తున్నాయి. మరి ఈ ఇసుక తుపాను నుంచి జగన్ సర్కార్ ఎలా బయటపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: