బిజెపితో పొత్తుకు చంద్రబాబునాయుడు పడుతున్న అవస్తలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.  కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పారు. నాలుగు నెలల క్రితం వరకూ ఇదే చంద్రబాబు ఇదే అమిత్ షా ను ఎన్నిమాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత నరేంద్రమోడి, అమిత్ లను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నానా మాటలన్నారు. అందులోను ఎన్నికల సమయం కదా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. పై ఇద్దరిలోను అమిత్ ను పక్కన పెట్టినా మోడి వ్యక్తిగత జీవితం గురించి కూడా చంద్రబాబు దిగజారిపోయి మాట్లాడిన విషయం అందరూ చూసిందే.

 

సీన్ కట్ చేస్తే ఢిల్లీలో రెండోసారి నరేంద్రమోడి అధికారంలోకి వస్తే ఏపిలో జగన్ అఖండ మెజారిటితో సిఎం అయ్యారు. దాంతో చంద్రబాబు కళ్ళు బైర్లుకమ్మి  భవిష్యత్తుపై టెన్షన్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డితో సయోధ్య సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ మోడి, అమిత్ ల కాళ్ళబేరం మొదలుపెట్టారు. బిజెపితో పొత్తు తెంచుకుని తప్పు చేశామని, మోడిపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదంటూ బహిరంగ ప్రకటనలు ఇందులో భాగమే.

 

ఇక తాజాగా అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం కూడా పొత్తుకు వెంపర్లాడటంలో భాగంగానే చూడాలి. ఎందుకంటే శ్రీవారి దర్శనార్ధం అమిత్ తిరుమల వచ్చినపుడు ఆయన కారుపై రాళ్ళు, చెప్పులు వేయించారు చంద్రబాబు. అవన్నీ చంద్రబాబు మరచిపోయినట్లు నటిస్తున్నా బిజెపి మరచిపోలేదు.

 

అమిత్ షా ను ప్రసన్నం చేసుకునేందుకే ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పారు. ఎలాగూ నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపిన విషయం తెలిసిందే. అంటే మళ్ళీ బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఏస్ధాయికన్నా దిగజారుతారన్న విషయం ఇక్కడ మరోసారి అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిజెపి ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయంలో అంతిమ నిర్ణయం నరేంద్రమోడిదే. కాబట్టి చంద్రబాబు ప్రయత్నాలను మోడి మన్నిస్తారా ? అన్నదే సస్పెన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: