తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌కు ఆగ‌ర్భ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న వ్య‌క్తికి కొద్దికాలం క్రితం గులాబీ కండువా క‌ప్పిన కేసీఆర్‌...తాజాగా కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డిని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నియమించారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి, ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన దాదాపు ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే వంటేరు ప‌ద‌వి ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.


వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేసీఆర్ ప్ర‌త్య‌ర్థిగా 2014, 2018ఎన్నికల్లో భీకరంగా పోరాడినా, బలమైన పోటీదారునిగా ప్రచారం జరిగినా చివరకు కేసీఆర్‌ సునామీ ముందు నిలువలేకపోయారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీచేసిన వంటేరు ప్రతాపరెడ్డి ఓడిస్తానని సవాల్‌ చేశారు. అయితే, ఆయ‌నే ఓడిపోయారు. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కాగా భవిష్యత్‌ రాజకీయాలు, వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గులాబీకండువా కప్పుకోవాలని ప్రతాప్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. గజ్వేల్‌ అభివృద్దికోసమే తాను పార్టీమారుతున్నట్లు ప్రకటించినా ప్రతాపరెడ్డి రాజకీయభవిష్యత్‌పై కేసీఆర్‌ భరోసానిచ్చినట్లు ప్రచారం జరిగింది.

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో...గ‌జ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలం ఒంటిమామిడి చెక్‌పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా వంటేరు ప్రతాప్‌రెడ్డి అనుచరుడు హన్మంత్ దగ్గర రూ.20లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్మంత్ ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా నగదు పట్టుకున్నారు. హన్మంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలో ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద  రాత్రి ఆయన దీక్షకు దిగి  తెరాస నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తున్నారని ఆరోపించారు. కుల, మత, సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ డబ్బు ఎర చూపుతున్నారన్నారు.. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇవన్నీ అధికారులకు కనిపించటం లేదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అప్పటి వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను..’ అంటూ విరుచుకుప‌డ్డారు. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఓట‌మి పాలైన వంటేరు ప్ర‌తాప్ రెడ్డి...టీఆర్ఎస్‌లో చేరిక స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం.  ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ముఖ్య‌నేత‌, త‌న మేన‌ల్లుడు హరీశ్‌రావుతో సంబంధం లేకుండానే ఈ చేరికవ్యవహారాన్ని నేరుగా సీఎం సన్నిహితులతో వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుకున్నట్లు పార్టీవర్గాల్లో వినిపిస్తోంది. దానికి కేసీఆర్ సైతం ఓకే చెప్పేయ‌డం, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా క‌ప్పేయ‌డం జ‌రిగింద‌ని కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: