ఆంధ్ర ప్రదేశ్ లో వైద్య  సేవలన్నింటిని ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ ఉత్తర్వులు ఆరునెలల పాటు అమలులో ఉండనున్నాయి . ప్రభుత్వ  వైద్య సేవలతోపాటు , ప్రైవేట్  వైద్య సేవల్ని కూడా  ఎస్మా  పరిధిలోకి తీసుకువస్తున్నట్లు జీవో లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది . ఒక్క వైద్య సేవలతోనే సరిపెట్టకుండా , శానిటేషన్ , విద్యుత్ , ఆహార సరఫరా,  రవాణా , బయో మెడికల్ వ్యర్ధాల తొలగింపు , అంబులెన్స్ సర్వీసులు , భద్రతా సిబ్బందిని కూడా ఎస్మా పరిధిలోకి చేర్చింది .

 

ఎస్మా పరిధిలో చేర్చబడిన  అత్యవసర సేవలు నిర్వహించే సిబ్బంది  ఎవరు కూడా ఉద్దేశ్యపూర్వకంగా  ఈ ఆరునెలల పాటు విధులకు గైర్హాజరయితే , వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లభించనుంది  . ఆంధ్ర ప్రదేశ్ లో  కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న  నేపధ్యం,  ఒకవైపు లాక్  డౌన్ ను మరింత కఠినతరంగా అమలు  చేస్తూనే , మరొకవైపు అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ కీలక  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఢిల్లీలోని మర్కజ్ మసీదు లో తబ్లీగి  జమాత్ సమావేశాలకు వెళ్లివచ్చిన వారి ద్వారా రాష్ట్రం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది .

 

అదే సమయం లో ఏపీ లో కరోనా వ్యాధి బారిన పడి ఒక వ్యక్తి మృతి చెందాడు . విజయవాడ లోని కుమ్మరిపాలానికి చెందిన  సుభానీ గతనెల 30  వతేదీన మరణించాడు . అయితే మరణానంతరం పరీక్షలు నిర్వహించగా , అతనికి  కరోనా పాజిటివ్ అని తేలింది . దీనితో ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా బారిన పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లయింది . రాష్ట్రం లో  పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ చట్టప్రకారం అత్యవసర సేవల్ని ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది .     

మరింత సమాచారం తెలుసుకోండి: