ఎంత కాదనుకున్నా మనది సెంటిమెంట్ల సమాజం. పూజల విషయంలో ఎన్నో సాంప్రదాయాలు, ఆనవాయితీలు ఉంటాయి. ఆ పూజ అలా చేయకూడదు.. ఈ పూజ ఇలా చేయకూడదని అని బోలెడు నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి నిబంధనలే ఏపీ సీఎం చంద్రబాబుకు చిక్కులు  తెచ్చిపెడుతున్నాయి. విపక్షాల విమర్శలకు కారణం అయ్యేలా చేస్తున్నాయి. 

రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రజల సెంటిమెంటుగా మలచాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మన మట్టి- మన నీరు అని కొత్త ప్లాన్ వేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుంచి మట్టి-నీరు సమీకరించి పూజలు చేసి దాన్ని అమరావతికి తరలిస్తారట. 

అలా సేకరించిన మట్టితో ఓ స్థూపం నిర్మిస్తారట. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. స్వయంగా చంద్రబాబు తన సొంత గ్రామంలో పుట్టమన్ను తీసి పూజలు చేశారు. అయితే చంద్రబాబు అలా పూజలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. అందుకు ఓ కారణం ఉంది. 

ఇటీవలే చంద్రబాబు ఇంటిపేరిట ఉన్న సమీప బంధువు మరణించారు. ఆ ఘటన జరిగి కొన్ని రోజులే అయ్యింది. ఆ అంటు ఉన్న చంద్రబాబు మన మట్టి - మన నీరు పూజలో ఎలా పాల్గొంటారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. సమీప బంధువు మరణించినందు వల్ల చంద్రబాబు ఏడాది వరకు ఎలాంటి పూజలో పాల్గొనకూడదని సూచించారు. చంద్రబాబు అనాలోచిత చర్యలతో రాష్ట్రానికే అరిష్టం అని చెవిరెడ్డి విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: