గుంటూరు జిల్లాలోని అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నవీనరాజధానిగా ఒక రేంజిలో ఎస్టాబ్లిష్‌ చేయడానికి చంద్రబాబునాయుడు ఎంత తపన పడుతూ ఉన్నారో అర్థమవుతూనే ఉంది. సొమ్ము దుబారా ఒక్కటీ ఎక్కువ మందిని బాధిస్తుంది గానీ.. అసలు ప్రయత్నాన్ని తప్పుబట్టే వారు మాత్రం ఎవ్వరూ ఉండరు. ఆ విషయంలో అమరావతిని కార్యరూపంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు దూకుడు కూడా బీభత్సంగా కనిపిస్తోంది. ఆయనే అంత దూకుడుగా ముందుకువెళుతుండగా.. ఆయనను తలదన్నేలా మరింత దూకుడుగా, అమరావతిని తక్షణమే రాజధాని హోదాలో వాడేసుకోవడానికి మరికొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను (అంటే సాధారణంగా డిసెంబరు/ జనవరి నెలల్లో జరిగేసమావేశాలను) అమరావతిలోనే నిర్వహించాలని స్పీకరు కోడెల శివప్రసాదరావు నిశ్చయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికోసం అమరావతిలో ముందుగా కొన్ని తాత్కాలిక భవనాలను, పూర్తిస్థాయి అసెంబ్లీ తరహాలోనే నిర్మింపజేసేయాలని దీనికి సంబంధించి స్పీకరు కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 


చంద్రబాబు 22న శంకుస్థాపనకు ఒక హడావుడిలో ఉండగా, ఆ వెంటనే అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ నిర్మించడానికి కోడెల శివప్రసాద్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ తాత్కాలిక భవనాన్ని ఎలాంటి టెక్నాలజీతో నిర్మిస్తారో.. ఎంత కాలం మనగలిగేలా నిర్మిస్తారో తెలియదు గానీ.. 30 రోజుల్లో పూర్తి చేస్తారని అంటున్నారు. ఓ మోస్తరు సినిమా సెటింగ్‌ వేయాలంటేనే.. ఈరోజుల్లో 30 రోజుల వ్యవధి సరిపోవడం లేదు. అలాంటిది ప్రజాప్రతినిధులందరూ కొలువుదీరి చర్చించవలసిన సమావేశ భవనాన్ని 30 రోజుల్లో ఎలా పూర్తి చేస్తారన్నది ఒక సస్పెన్స్‌. ఒకవేళ అత్యాధునిక టెక్నాలజీ దానిని సాధ్యం చేసినా.. అది ఎన్నాళ్లుంటుందో అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. 


చంద్రబాబు మరియు సింగపూర్‌ వారి ప్లాన్‌లోని అసలు అసెంబ్లీ భవనాలు కార్యరూపం దాల్చిన తర్వాత.. ఈ అసెంబ్లీ భవనాన్ని ఏం చేస్తారోనని కూడా సందేహాలున్నాయి. కట్టేదే తాత్కాలిక భవనమే గనుక.. నగర నిర్మాణం పూర్తయ్యాక దీనిని కూల్చేస్తారేమోనని, కూల్చేసే దానికి ఇంత భారీ వ్యయం అవసరమా అని జనం అనుకుంటున్నారు. ఏపీలోనుంచే సమస్త వ్యవహారాలు జరిపించాలనేదే ప్రభుత్వం స్ఫూర్తి అయితే గనుక.. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకుని, ఇదివరకు ప్లాన్‌ చేసిన తరహాలోనే.. నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోనే అసెంబ్లీ నిర్వహిస్తే సరిపోతుంది కదా.. అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 


కొన్ని నెలలకు ఒకసారి కొన్ని రోజుల పాటూ జరిగే ముచ్చటకోసం ప్రస్తుతం తాత్కాలిక భవనం నిర్మించి, తర్వాత దానిని కూల్చివేసి... ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: