అమరావతి శంకుస్థాపన మహోత్సవం అట్టహాసంగా ముగిసింది. 400 కోట్లు ఖర్చు చేశారని ప్రతిపక్షం విమర్శిస్తుంటే.. అబ్బే.. అంత కాదు.. అంతా 9 కోట్లలోనే కానిచ్చేశాం అని అధికారపక్షం సమర్థించుకుంటోంది. అలాగే శంకుస్థాపన ముగిసి నాలుగు రోజులైనా అంతా సర్దుకోవాల్సిందిపోయి.. ఇప్పుడు ఆ వేదిక సాక్షిగా కులలా కుమ్ములాటలు మొదలయ్యాయి. 

అమరావతి వేదికపై తమకు స్థానం దక్కలేదని.. అందుకు తమ కులాన్ని తొక్కేయడమే కారణమని ఆరోపించేవారు పెరిగిపోతున్నారు. అమరావతి శంకుస్థాపనకు ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై ఒక్క రైతుకుగాని, ఒక దళితుడుకు గాని చోటు ఇవ్వలేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షపార్టీ వైసీపీ ఆరోపించింది. భూములు ఇచ్చిన రైతులకు గాని, బలహీనవర్గాలకు గాని ఎందుకు చోటు ఇవ్వలేదని  ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

మరోవైపు శంకుస్థాపన వేదికపైకి కాపు నాయకులను ఎవరినీ పిలవకపోవడం అవమానకరమని కాపు నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. రాజదాని వేదికపైకి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ను కాని, జనసేన నేత పవన్ కళ్యాణ్ ను కాని పిలవలేదని, ఇది కాపులను అవమానించడమేనని కాపు నాడు నేత వెంకటేశ్వర్లు కర్నూల్లో విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని.. వీటిపై తాము ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

రాజదాని శంకుస్థాపనలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని మరో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నారు. లోకేష్ కు పట్టాబిషేకం చేయడానికే రాజధాని శంకుస్థాపనను ఇంత ఆర్భాటంగా నిర్వహించారని విమర్శించారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కమ్మరాజ్యం కోసం ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ మహిళానేత గంగాభవాని కూడా ఆరోపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: