ఇన్నాళ్లూ రేటింగ్ చార్టుల్లో 3, 4, 5 స్థానాలతో సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటీవీ ఒక్కసారిగా మా, జీ టీవీలకు షాక్ ఇచ్చింది. అన్నింటినీ వెనక్కు నెట్టేసి ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.    తెలుగునాట తనకు ఎదురులేదని నిరూపించింది. తాజా బార్క్ రేటింగ్స్ ప్రకారం 31 శాతం రేటింగ్ పొంది ఫస్ట్ ప్లేస్ సంపాదించింది. 27 శాతం రేటింగ్స్ తో మాటీవీ సెకండ్ ప్లేస్ లోఉంది. 

ఇక జీ టీవీ 23 శాతం రేటింగ్ సంపాదించగా.. 19 శాతం రేటింగ్స్ తో జెమినీ టీవీ నాలుగో స్థానంలో ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిపిన సర్వే ద్వారా ఈ రేటింగ్స్ ఇచ్చారు. ఈటీవీ కొన్నాళ్లుగా తన మూస పద్దతి విడనాటి సరికొత్త ప్రోగ్రామ్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి జబర్దస్త్ వంటి ప్రోగ్రాములు.. రేటింగ్ ఛార్టుల్లో ఈటీవీని అగ్రస్థానంలో నిలబెట్టాయి. 

ఈ రేటింగులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇన్నాళ్లూ టీవీ ఛానళ్ల రేటింగులను టామ్ అనే సంస్థ అందజేసేది. ఈ టామ్ రేటింగ్స్ పై ఎన్నో విమర్శలున్నాయి. కేవలం అతి తక్కువ శాంపిళ్లతోనే రేటింగ్స్ ఇవ్వడం వల్ల టాంపరింగ్ కు ఎక్కువ అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్.. ఏర్పాటైంది. 

టీవీ బ్రాడ్ కాస్టర్స్, మీడియా సంస్థలు, ఎడ్వర్టైజర్స్ ..అంతా కలిపి ఏర్పాటు చేసుకున్నదే ఈ   బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్..  ముద్గుగా బార్క్ అని పిలుచుకుంటారు. గతంలో టామ్ రేటింగ్ కేవలం రేటింగ్ సెంటర్స్ గా ఉన్న పట్టణాల వీక్షక పరిస్థితినే ప్రతిబింబించేది. ఇప్పుడు బార్క్ మొట్టమొదటిసారిగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్స్ లో ఈటీవీ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండటమే కాదు.. ప్రాంతీయ భాషా ఛానళ్లలో దేశంలోనే సెకండ్ ప్లేస్ సంపాదించిందట. 

ఇంతవరకూ బాగానే ఉన్నా.. తెలుగు భాషకూ, తెలుగు సంప్రదాయానికి, సంస్కృతులకు పెద్దపీట వేసే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ వంటి కార్యక్రమాలు కాస్త శ్రుతి మించుతున్నట్టు కనిపిస్తోంది. ప్రేక్షకాదరణ ఉన్నా.. కొన్ని ఎపిసోడ్లు చిన్నా, పెద్దా కలిసి చూసేందుకు ఇబ్బందిపడే స్థాయిలో ద్వంద్వార్ధాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లోటుపాట్లు అధిగమించగలిగితే.. ఈటీవీ తన గౌరవాన్ని పదికాలాలపాటు నిలబెట్టుకుంటుందనడంలో సందేహం అవసరం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: