ప్రతిపక్షాలకు చెందిన నాయకులు తిట్టిపోయడం వేరు.. సొంత పార్టీకి చెందిన వారే నిందలు వేయడం వేరు. సొంతపార్టీలోని సీనియర్‌ నేతలు, పైగా ప్రజల దృష్టిలో అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న నేతలు చేసే విమర్శలకు ప్రజల్లో మన్నన కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. నరేంద్రమోడీ ప్రధానిగా కాకముందు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఆయన రాజ్యమేలడం మొదలయ్యాక.. భాజపాలోనే అనేక మంది సీనియర్లు ఆయన అనుసరిస్తున్న పోకడల మీద పెదవి విరుస్తున్నారు. ఎంతో సీనియారిటీ అనుభవం ఉన్న ఓ మోస్తరు నాయకులనుంచి.. ఎల్‌కే అద్వానీ వరకు మోడీ తీరు మీద ఆగ్రహం క్కుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. అయితే అద్వానీ వంటి వారిని ఏమీ అనలేక మౌనం పాటిస్తారు గానీ.. మిగిలిన నాయకులు మోడీని, ఆయన పాలనను విమర్శిస్తే వందిమాగధుల బృందంలోని వెంకయ్య నాయుడు వంటి వారికి ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చేస్తుంది. 


తాజాగా అదే జరుగుతోంది. భారతీయ జనతా పార్టీలోని సీనియర్‌ నాయకుడు, సుప్రసిద్ధ ఆర్థికవేత్త, జర్నలిస్టు, వాజపేయి ప్రధానిగా ఉన్న రోజుల్లోనే టెలికాం మరియు ఐటీ శాఖకు కేంద్ర మంత్రిగా సేవలందించిన అరుణ్‌శౌరీ తాజాగా చేసిన ఆరోపణలను వెంకయ్యనాయుడు తిప్పికొడుతున్నారు. 


మోడీ సర్కారు చేపడుతున్న ఆర్థిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ అరుణ్‌శౌరి ఇటీవల విమర్శించారు. ఆయన తమ పార్టీకే చెందిన సీనియర్‌ నాయకుడు కావడంతో.. భాజపా వారికి ఆ విమర్శలు గొంతులో పచ్చివెలక్కాయలా మారాయి. అయితే వెంకయ్యనాయుడు మాత్రం.. తెరమీదికి వచ్చి.. ఆ వ్యాఖ్యలు అరుణ్‌శౌరీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని, సొంత పార్టీ నాయకుడి అభిప్రాయంగా పరిగణించనక్కర లేదని, ఆయనకు అసలు తమ పార్టీ సభ్యత్వం కూడా లేదని అంటున్నారు. 


వాజపేయి మంత్రివర్గంలోనే పనిచేసిన వ్యక్తి, తమ పార్టీలో ఈ ఏడాదిలో టెక్నికల్‌గా సభ్యత్వం కలిగి ఉండకపోయినంత మాత్రాన... శౌరీ మాటలకు విలువ తగ్గిపోతుందా? అనేది ప్రజల ప్రశ్న. వెంకయ్యనాయుడుకు చేతనైతే.. శౌరీ చేసిన విమర్శలకు నిర్మాణాత్మక సమాధానాలు చెప్పాలి తప్ప.. ఇలా మా పార్టీ సభ్యుడు కాదు అంటూ డొంకతిరుగుడు సమాధానాలు ఎందుకని పలువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: