హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఆంద్ర ప్రజలు చేసిన అతి పెద్ద తప్పిదం ఏమంటే రాష్టం మొత్తాన్ని పణంగా పెట్టి దాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం. ఈ తప్పిదమే పని లేకుండా పోయిన రాజకీనేతకు లడ్డూలా ఉపయోగపడి, ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆయన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది. సీమాంధ్రులంతా.. కేవలం హైదరాబాదు కోసమే.. రాష్ట్రం కలిసి ఉండాలనే కోరికను ఆనాడు వ్యక్తం చేశారన్నా అతిశయోక్తి కాదు. 


విభజన గాయాల పోటు నేపథ్యంలో ఆంధ్ర నేతలు ఇప్పుడైనా తమ పాత తప్పిదాలను రిపీట్ చేయకుండా నవ్యాంధ్రను దామాషా పద్దతిలో అభివృద్ది చేయాలని ఎవరైనా భావిస్తారు. కానీ విషాదమేమిటంటే మన ఊహల్లోనే ఏదో తప్పు ఉందా అనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. వారికి అమరావతి అంటేనే పూనకం వస్తోంది.  ఆయన రాష్ట్రం మొత్తం సంక్షేమం అంటే అమరావతి నిర్మాణం మాత్రమే అన్నట్లుగా సమస్త సంపదలనూ దోచి అక్కడే కుప్ప పోయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 


ఇప్పటికే నూతన రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంపై రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రజలు తమ అసమ్మతిని తెలుపుతున్నారు. అభివృద్ధి విషయంలో తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారు భావిస్తున్నారు. వారి వాదనల్లో పస లేకపోలేదు. ఏమిటంటే చంద్రబాబు నాయుడికి చెందిన నిర్దిష్ట కులం మాత్రమే అమరావతి ద్వారా ప్రయోజనం పొందనున్నారన్నది ప్రస్తుతం ఒక సాధారణ అవగాహనగా ఉంటోంది. అయితే చంద్రబాబునాయుడు రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి ఆయన రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రాంతాల అభివృద్ధిని కూడ దృష్టిలో పెట్టుకుంటారని ఎవరైనా భావించవచ్చు. 


ఏపీ మొత్తంగా తనను ఎన్నుకుంది కాబట్టి ముఖ్యమంత్రి తన స్వంత కులాన్ని కాకుండా ఏపీలోని అన్ని ప్రాంతాలు, పౌరులందరి సంక్షేమాన్ని గురించి ఆలోచించాలలని జనం కోరుతున్నారు.. ఇప్పటికే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తుతోంది. గత రెండు దశాబ్దాలుగా రాయలసీమ వ్యక్తులే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఉదాహరణను చూస్తే రాయలసీమ సీఎంలు తమ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోలేదు కాబట్టే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ పుట్టుకొస్తోందేమో మరి. రాయలసీమ డిమాండ్ ఊపందుకునే కొద్దీ.. అటు ఉత్తరాంధ్ర వారిని కూడా వేర్పాటు వాదపు పురుగు తొలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి అమరావతి పుణ్యం.. ఏపీలో వేర్పాటు వాదం పురుడు పోసుకుంటున్నట్లుగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: